‘111 జీవో రద్దుతో హైదరాబాద్ ఆగం కాబోతోంది’

ఆదమరిస్తే పట్నం ఆగమవుతుంది. ప్రభుత్వం 111 జీవో రద్దు చేసి సర్కార్ పట్నానికి పాడె కడుతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగు నీరందించే గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు మరో హుస్సేన్ సాగర్‌

Update: 2023-05-23 12:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదమరిస్తే పట్నం ఆగమవుతుంది. ప్రభుత్వం 111 జీవో రద్దు చేసి సర్కార్ పట్నానికి పాడె కడుతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగు నీరందించే గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు మరో హుస్సేన్ సాగర్‌లా మారే ప్రమాదం ఉందని తెలంగాణ సమాఖ్య, హైదరాబాద్‌ జిందాబాద్‌, తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు, మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారని తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ దేశాయి అన్నారు.

గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది.

భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ తెచ్చిన జీవో 111ను పూర్తిగా తొలగించడం దుర్మార్గం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. జంట జలాశయాలను రక్షించుకోవడానికి జంటనగరాల ప్రజలు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే 25న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని సెంట్ జాన్స్ చర్చ్ ఎదురుగా ఉన్న గురుస్వామి హాల్ లో “111జీవో రద్దుతో పట్నానికి పాడె” అంశం మీద భవిష్యత్తు కార్యాచరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరితో పాటు పలువురు పర్యావరణవేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు.

Also Read..

ఇదేనా బంగారు తెలంగాణ..? సీఎం కేసీఆర్‌పై RSP ఫైర్ 

Tags:    

Similar News