TG Budget 2024: అటవీ, పర్యావరణ శాఖ శాఖకు 1064 కోట్లు.. గతేడాది కంటే 407 కోట్లు తక్కువ
అటవీ పర్యావరణశాఖకు 2024-25 బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం 1064 కోట్లు మాత్రమే కేటాయించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : అటవీ పర్యావరణశాఖకు 2024-25 బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం 1064 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ప్రభుత్వం 2023-24 రాష్ట్ర బడ్జెట్ లో 1471 కేటాయించింది. సుమారు 407 కోట్ల రూపాయలను ఈసారి తక్కువగా కేటాయించారు. రాష్ట్రంలో అటవీ పరిరక్షణకు, అభివృద్ధికి దోహదపడే విధంగా ఎకో టూరిజం(పర్యావరణ పర్యాటకం)ను పెంపొందించాలని నిర్ణయించినట్లు ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పటిష్టమైన ఎకో టూరిజం విధానాన్ని పెంపొందించడానికి అటవీశాఖ మంత్రి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఒడిశా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కమిటీ పర్యటించి వారు అనుసరించే ఉత్తమ పద్దతులను సేకరించి ఇచ్చే నివేదిక ఆధారంగా ఎకో టూరిజం పాలసీని అమలు చేస్తామన్నారు.
దీని కోసం రాష్ట్రంలోని ఏడు అటవీ ప్రాంతాలను గుర్తించామన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఆదిలాబాద్ లోని కుంటాల జలపాతం, వికారాబాద్ అనంతగిరి సర్క్యూట్, ఖమ్మంలోని కనకగరి, కొత్తగూడెంలోని కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం సర్క్యూట్ లను గుర్తించామన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి తో పర్యావరణ పరిరక్షణ తో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 20.02కోట్ల చెట్లను నాటే లక్ష్యంగా ప్రభుత్వం వజ్రోత్సవ వమన మహోత్సవం ప్రారంభించామన్నారు. మనుషులకు, జంతువులకు మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచినట్లు వెల్లడించారు.