నెలాఖరు వరకు టోటల్ షట్ డౌన్

దిశ, న్యూస్ బ్యూరో కరోనా వ్యాప్తి నిరోధకాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రమంతా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ కానుంది. అత్యవసర సేవలు మినహా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళు, సబర్బన్ రైళ్ళు, ఎంఎంటీఎస్ రైళ్ళు అని నిలిచిపోతున్నాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 31వ తేదీ వరకూ ప్రజలు ఇలాంటి సహకారాన్నే అందించాలని కోరారు. పాలు, కూరగాయలు, నిత్యావసర […]

Update: 2020-03-22 08:21 GMT

దిశ, న్యూస్ బ్యూరో
కరోనా వ్యాప్తి నిరోధకాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రమంతా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ కానుంది. అత్యవసర సేవలు మినహా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళు, సబర్బన్ రైళ్ళు, ఎంఎంటీఎస్ రైళ్ళు అని నిలిచిపోతున్నాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 31వ తేదీ వరకూ ప్రజలు ఇలాంటి సహకారాన్నే అందించాలని కోరారు. పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా ఇంటికి ఒకరు చొప్పున రోడ్డు మీదకు రావచ్చునని, ప్రతీ ఒక్కరూ మూడు అడుగుల దూరాన్ని పాటించాలని కోరారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రేషను దుకాణాల ద్వారా తెల్ల కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి నెల రోజులకు సరిపడా ఒక్కొక్కరికి పన్నెండు కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కొనుక్కోడానికి వీలుగా తలా రూ. 1500 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. 1897 నాటి ఎపిడమిక్ చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలుచేస్తున్నామని తెలిపారు.

పేదల ఆకలి అవసరాలకు బియ్యం కోసం ప్రభుత్వానికి అదనంగా రూ. 1103 కోట్ల మేర భారం పడుతుందని, బడ్జెట్‌లో లేకపోయినప్పటికీ సమకూరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దీనివలన సుమారు 87.59 లక్షల కుటుంబాలకు 3.36 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని, వీటిని పౌరసరఫరాల శాఖ సిద్ధం చేస్తోందన్నారు. దీన్ని ప్రజలకు ఏ విధంగా అందజేయాలన్నదానిపై ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే దీనికి అవలంబించే విధి విధానాలు వెల్లడవుతాయన్నారు. ప్రతీ ఒక్కరికీ రూ. 1500 చొప్పున ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వానికి సుమారు రూ. 1314 కోట్ల మేర భారం పడుతుందని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది ఒక సంక్షోభ సమయం కాబట్టి ఇళ్ళలోనే ఉండిపోవడం ద్వారా కరోనా ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండాలని, విధులకు రావాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ కార్యాలయంలో ఆ శాఖ అధిపతి రోస్టర్ సిస్టమ్‌ను రూపొందించి 20% మంది మాత్రమే విధుల్లోకి వచ్చేలా రొటేషన్ జాబితా తయారుచేస్తారని, మిగిలిన 80% మంది ఇంటి దగ్గరే ఉంటారన్నారు. విద్యాశాఖకు సంబంధించిన పనులన్నీ మార్చి 31 వరకు పూర్తిగా ఆగిపోతాయని, జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియ కూడా నిలిచిపోతుందని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తుందని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇళ్ళకే పరిమితం కావాలని, వారికి ఆయా కంపెనీల యాజమాన్యాలే వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఉల్లంఘన జరిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

అత్యవసర సేవల విభాగంలో పనిచేసే ఉద్యోగులు మాత్రం యధావిధిగా విధుల్లో ఉంటారని వివరించారు. వైద్యం, విద్యుత్, పారిశుద్యం లాంటి సర్వీసుల్లోని ఉద్యోగులు విధులకు హాజరవుతారని తెలిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఇప్పటికే సెలవు ఇవ్వడం గురించి వివరించామని తెలిపారు. సినిమాహాళ్ళు, మ్యూజియంలు, పబ్‌లు, క్లబ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ మాల్స్… ఇలా సర్వం బంద్ అవుతాయని, జనం గుమికూడే ప్రాంతాలన్నీ లాక్ డౌన్ అవుతాయని తెలిపారు. మొత్తం రాష్ట్రం స్థంభించిపోతుందని, ఇండ్లలోంచి రోడ్డు మీదకు రావద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు భవన నిర్మాణ కార్మికుల్లాంటి అసంఘటిత కార్మికులకు ఆయా ఏజెన్సీ (యాజమాన్యం)లే వేతనం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

పబ్లిక్ రవాణా బంద్

నగరంలో తిరిగే సిటీ బస్సులు, మెట్రో రైళ్ళు, ఎంఎంటీఎస్ రైళ్ళతో పాటు అన్ని ప్రజా రవాణా వాహనాలు ఈ నెల 31వ తేదీ వరకు నిలిచిపోతాయని సీఎం తెలిపారు. ఆటోలు, టాక్సీలు కూడా తిరగవని, తిరిగినట్లయితే వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలన్నీ కూడా బోర్డర్‌కు అవతలే ఆగిపోతాయన్నారు. రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో సరిహద్దుగా ఉన్న రోడ్లన్నీ మూతబడతాయని, రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయన్నారు. మన క్షేమం కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఇప్పటికే రైళ్ళన్నింటినీ ఈ నెల 31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తుచేశారు.

144 సెక్షన్ అమలు

రాష్ట్రవ్యాప్తంగా ఎపిడమిక్ యాక్ట్ అమల్లో భాగంగా 144 సెక్షన్ కూడా అమలవుతుందని, ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు అధికారులు సైతం పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కోరారు. ఒకే చోట ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. అందువల్లనే ఇంటికొక్కరు మాత్రమే నిత్యావసర వస్తువులను కొనుక్కోడానికి రోడ్లమీదకు రావాల్సిందిగా అనుమతి ఇచ్చామని, ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో ఎక్కువ మంది రోడ్లమీదకు వస్తే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. తెలంగాణ సమాజానికి కరోనా సోకకుండా తీసుకుంటున్న చర్యలు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

గర్భిణీల కోసం ప్రత్యేక చర్యలు

ఈ నెల, వచ్చే నెలలో ప్రసవించే గర్భిణీ మహిళల పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు యధావిధిగా కొనసాగుతాయని, ఇందుకోసం ఆంబులెన్స్‌లను, అమ్మ ఒడి వాహనాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచుతోందన్నారు. ఆసుపత్రుల్లో వారికి తక్షణ వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతో అత్యవసరం కాని సర్జరీలను వాయిదా వేయాల్సిందిగా ఆసుపత్రులకు ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. అంగన్‌వాడి కేంద్రాల దగ్గర జనం గుమికూడే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆ కేంద్రాల ద్వారా పౌషకాహారాన్ని అందుకుంటున్న చిన్నారులు, మహిళల కోసం నగదు రూపంలో సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ డబ్బులతో లబ్ధిదారులే వండుకునే వీలు కలుగుతుందన్నారు.

ఇది సంఘీభావ సంకేతం

జనతా కర్ఫ్యూకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల చివరి వరకూ అదే సహకారాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు. ఇది కేవలం సంఘీభావం మాత్రమే కాదని సమాజం కోసం వారు స్పందించిన సంకేతం కూడా అని కొనియాడారు. తెలంగాణ సమాజానికి కరోనా సోకవద్దనే పిలుపుతో ఇండ్లకే పరిమితమై మంచి స్ఫూర్తిని కనబరిచారని, ఇది మరో తొమ్మిది రోజుల వరకు కొనసాగాలని కోరారు. ఒక్కరోజు నియంత్రణ ఒక్క జీవిత కాలానికి సరిపోతుందని, తెలంగాణ సమాజం నుంచి కరోనాను దూరం చేయడానికి మరో తొమ్మిది రోజుల సంయమనం, సహకారం, సంఘీభావం అవసరం అని కోరారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అందరూ చప్పట్లు కొట్టి మద్దతు తెలియజేయడం యావత్తు దేశానికి స్ఫూర్తినిచ్చిందని, తెలంగాణ పట్టుదల మరోసారి వెలుగులోకి వచ్చిందన్నారు.

Tags: Telangana, Total Lockdown, March 31, Corona, Ration, Cash Assistance, Transport Closure

Tags:    

Similar News