‘ఆ భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి’
దిశ, తెలంగాణ బ్యూరో: రూ. వేల కోట్ల విలువైన భూదాన్ భూముల కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలని తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్.శంకర్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆచార్య వినోబా భావే తెలంగాణలో ధనిక భూస్వాముల నుంచి దానం రూపంలో సేకరించిన వేలాది ఎకరాల భూదాన భూములను రక్షించి పేదలకు పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన […]
దిశ, తెలంగాణ బ్యూరో: రూ. వేల కోట్ల విలువైన భూదాన్ భూముల కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలని తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్.శంకర్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆచార్య వినోబా భావే తెలంగాణలో ధనిక భూస్వాముల నుంచి దానం రూపంలో సేకరించిన వేలాది ఎకరాల భూదాన భూములను రక్షించి పేదలకు పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రూ. వేల కోట్ల విలువైన భూదాన్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే సిన్హా ఆధ్వర్యంలో రెవెన్యూ టాస్క్‌ఫోర్స్ కమిటీ అత్యధికంగా భూదాన్ భూములు ఆక్రమించబడ్డాయని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికలను సమర్పించిందని గుర్తు చేశారు. ఎస్కే సిన్హా కమిటీ నివేదిక ఇచ్చి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం భూదాన్ భూముల ఆక్రమణలపై దృష్టి పెట్టలేదని, ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు.
కొంత మంది సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు భూకబ్జాదారులతో కుమ్మకై కోట్లాది రూపాయల విలువ భూదాన్ భూములను హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాలలో ప్రైవేట్ పార్టీలకు మార్చారని ఆరోపించారు. సర్వ సేవా సంఘం జాతీయ కమిటీ భూదాన్ భూములను కాపాడాలని కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిని అనేకసార్లు కోరినప్పటికీ స్పందన లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూదాన్ భూముల భౌతిక ధృవీకరణలు చేయలేదని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోలేదని, భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి భూదాన్ భూముల సమస్యల పరిష్కరానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు.