కరోనా..రక్షించే వారికే రక్షణ కరువు

దిశ, హైదరాబాద్ : కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం అంతగా కనిపించడం లేదు.వ్యాధిని అరికట్టడంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా..కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. మొన్నటివరకూ డాక్టర్లు, వైద్య సిబ్బందిని వణికించిన ఈ వైరస్ నేడు పోలీసులను భయపెడుతోంది. ఇప్పటికే నలుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ రాగా, మరికొందరు క్వారంటైన్‌లో […]

Update: 2020-05-24 10:58 GMT

దిశ, హైదరాబాద్ :
కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం అంతగా కనిపించడం లేదు.వ్యాధిని అరికట్టడంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా..కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. మొన్నటివరకూ డాక్టర్లు, వైద్య సిబ్బందిని వణికించిన ఈ వైరస్ నేడు పోలీసులను భయపెడుతోంది. ఇప్పటికే నలుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ రాగా, మరికొందరు క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

లాక్‌డౌన్ వేళా అన్నీ తామై..

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని నేటి వరకూ పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. జనతా కర్ఫ్యూ మరుసటి రోజు మార్చి 23నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి.ఈ సమయంలో నిత్యావసరాల మినహా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్నీ బంద్ అయ్యాయి. అత్యవసరమైతే తప్పా.. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దంటూ పదే పదే విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, రాత్రింభవళ్ళు విధుల్లో నిమగ్నమయ్యారు.ఆ సమయంలో కొందరు పోలీసులు సొంత ఇళ్ళకు పోవడానికే భయపడ్డారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లినా..భార్య పిల్లలకు దూరంగా బయటి నుంచే ఆహారం తీసుకుంటున్న దృశ్యాలను సైతం మనం సోషల్ మీడియాలో చూశాం. వ్యాధి సోకిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లు, ఆయా ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, కరోనా వ్యాధికి చికిత్స అందిస్తున్న గాంధీ, కింగ్ కోఠి, ఫివర్ ఆస్పత్రులతో పాటు పాజిటివ్ కేసుల కాంటాక్ట్‌ల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లోనూ భద్రతపరమైన విధులు చేపడుతున్నారు.

ఒకరు మృతి – ముగ్గురికి పాజిటివ్

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలించినా.. నగరంలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా సడలింపులు చేసింది.సిటీలో కంటైన్మెంట్ ఏరియాలు, రెడ్ జోన్లు ఇంకా నడుస్తున్నాయి. ముఖ్యంగా వలస కార్మికులను సొంతూళ్లకు పంపించడంలో పోలీసులు చాలా కీలకమైన పాత్ర పోషించారు. పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవడం, వారికి ఫోన్లకు ట్రైన్ సమాచారం అందించడం, ప్రత్యేక బస్సుల్లో ఆయా రైల్వే స్టేషన్లకు తరలించడం, ఆహారం, నీళ్ల సౌకర్యాలను కల్పించడంలో ముఖ్య భూమిక పోషించారు. సరిగ్గా అదే సమయంలో కరోనా పాజిటివ్ వచ్చి 33 ఏళ్ళ ఓ కానిస్టేబుల్ మరణించాడు. అంతే కాకుండా ఓ స్టేషన్లో ఇన్‌స్పెక్టర్, మరో స్టేషన్లో ఎస్ఐలతో పాటు మరో ఇద్దరికి కరోనా నిర్దారణ అయ్యింది. ఇప్పటి వరకూ సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు సమాచారం. వీరిలో 40 మందికి నెగిటివ్ రిపోర్ట్ రాగా, మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది.ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో తాము అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు.ఈ విషయంపై పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్ రెడ్డి స్పందిస్తూ ఓ వైపు కరోనా రక్కసి భయపెడుతున్నా..ఆపత్కాలంలో ప్రజలను కాపాడటంలో తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సిందేనని అంటున్నారు.అందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News