ఏపీ అంబులెన్స్‌లకు తెలంగాణ బార్డర్‌లో బ్రేక్.. ఎందుకంటే..?

దిశ, తెలంగాణ బ్యూరో : ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్​ వైపు వస్తున్న కొవిడ్​ పేషెంట్ల అంబులెన్స్‌లను సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి వచ్చే అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. రవాణా వాహనాలకు ఇప్పటికే బ్రేక్​ వేసిన విషయం తెలిసిందే. వాస్తవంగా తెలంగాణ నుంచే ఇరు రాష్ట్రాలకు వెళ్లే వాహనాలను రావద్దంటూ ఆయా రాష్ట్రాల అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల సరిహద్దును దాటి హైదరాబాద్​కు వస్తున్న పేషెంట్లను తెలంగాణ […]

Update: 2021-05-09 23:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్​ వైపు వస్తున్న కొవిడ్​ పేషెంట్ల అంబులెన్స్‌లను సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి వచ్చే అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. రవాణా వాహనాలకు ఇప్పటికే బ్రేక్​ వేసిన విషయం తెలిసిందే. వాస్తవంగా తెలంగాణ నుంచే ఇరు రాష్ట్రాలకు వెళ్లే వాహనాలను రావద్దంటూ ఆయా రాష్ట్రాల అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల సరిహద్దును దాటి హైదరాబాద్​కు వస్తున్న పేషెంట్లను తెలంగాణ పోలీసులు నిలుపుదల చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ రామాపురం క్రాస్ రోడ్డు, గద్వాల జిల్లా అలంపూర్​లోని పుల్లూరు దగ్గర చెక్‌పోస్టు, అటు రాయచూర్​ నుంచి వచ్చే వాటిని బలిగెర, నిజామాబాద్​, ఆదిలాబాద్​ జిల్లాల సరిహద్దుల నుంచి వచ్చే కర్ణాటక, మహారాష్ట్ర అంబులెన్స్​లను నిలిపివేసేందుకు సోమవారం ఉదయం నుంచే చెక్​పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పేషెంట్లను తెలంగాణలోకి అనుమతించడంలేదు. అయితే డీహెచ్​ కార్యాలయంలో అనుమతి కోసం కంట్రోల్​ రూంను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్​ రూం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సదరు పేషెంట్లను తీసుకువచ్చే అంబులెన్స్​లకు అనుమతి రావాలంటే కంట్రోల్​ రూం నుంచి వివరాలు, బెడ్​ బుకింగ్​ పరిస్థితులన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది.

బెడ్స్​ ఖాళీగా ఉన్నట్లు ఆస్పత్రుల నుంచి అనుమతి వస్తేనే పోలీసులు అనుమతిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై సోమవారం ఉదయం మౌఖిక ఆదేశాల జారీ చేయడంతో చెక్​పోస్టులు ఏర్పాటయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండటంతో అక్కడి రోగులకు రాష్ట్రంలో అనుమతి లేదంటున్నారు.

బెడ్స్​ సరిపోకపోవడంతోనే నిర్ణయం

మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లకు బెడ్స్​ దొరకడం లేదు. ఆక్సిజన్​ సిలిండర్లు కూడా కష్టమే. రెమిడిసివిర్​ ఇంజక్షన్లు దొరకడం లేదు. ఇప్పటికే హైదరాబాద్​లోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన పేషెంట్లు దాదాపు 25 శాతం ఉంటారని అంచనా. ఇలాంటి సమయంలో పక్క రాష్ట్రాల నుంచి పేషెంట్లు మన రాష్ట్రానికి మరింత కొరత ఎక్కువ అవుతుందనే కారణంతో బ్రేక్​ వేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలోనే పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇంకా అనుమతిస్తే మన దగ్గరి పేషెంట్లకు ఇబ్బందులుంటాయని ఆపేస్తున్నట్లు అధికారులు చెప్పుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది. కొద్ది సేపట్లో వైద్యారోగ్య శాఖ నుంచి కొన్ని మార్గదర్శాలతో కలుపుకుని ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News