మన ఎమ్మెల్యేలకు జీతమెక్కువ.. పని తక్కువ..

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం. మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రం. అంతేనా… దేశంలోనే అత్యధిక ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తున్న రాష్ట్రం కూడా. వీటికి తోడు మరొక రికార్డు కూడా ఉంది. అత్యధిక జీతం తీసుకుంటోంది కూడా తెలంగాణ ఎమ్మెల్యేలే. ప్రతీ నెలా రెండున్నర లక్షల రూపాయల చొప్పున జీతం తీసుకుంటున్నారు. కొన్ని రకాల అలవెన్సులు, రాయితీలు దీనికి అదనం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలకు ఇంత ఎక్కువ వేతనం లేదు. ముఖ్యమంత్రుల్లో […]

Update: 2020-03-18 06:16 GMT

దిశ, న్యూస్ బ్యూరో:
తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం. మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రం. అంతేనా… దేశంలోనే అత్యధిక ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తున్న రాష్ట్రం కూడా. వీటికి తోడు మరొక రికార్డు కూడా ఉంది. అత్యధిక జీతం తీసుకుంటోంది కూడా తెలంగాణ ఎమ్మెల్యేలే. ప్రతీ నెలా రెండున్నర లక్షల రూపాయల చొప్పున జీతం తీసుకుంటున్నారు. కొన్ని రకాల అలవెన్సులు, రాయితీలు దీనికి అదనం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలకు ఇంత ఎక్కువ వేతనం లేదు. ముఖ్యమంత్రుల్లో కూడా అత్యధిక వేతనం తీసుకుంటున్నది తెలంగాణ సీఎం కేసీఆరే. ప్రతీ నెలా రూ. 4.10 లక్షల వేతనం. గతంలో ఎన్టీఆర్ కొంతకాలం ఒక రూపాయి జీతం తీసుకున్న విషయం తెలిసిందే. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ప్రతీ నెలా రూ. 1.25 లక్షలు, బెంగాల్ లో రూ. 82వేలు, కేరళలో రూ. 95 వేలు, కర్నాటకలో రూ. 1.40 లక్షలు, తమిళనాడులో రూ. 1.05 లక్షలు, మేఘాలయలో అత్యల్పంగా రూ.60వేలు చొప్పున జీతం తీసుకుంటున్నారు.

మన ఎమ్మెల్యేల పని విషయానికి వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అతి తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ఘనత కూడా తెలంగాణదే. తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2014-2018 మధ్య తొమ్మిది సెషన్లలో 126 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఆరు నెలల ముందుగానే అసెంబ్లీ రద్దయింది. తొలి టర్మ్‌లో మొత్తం సుమారు 620 గంటల పాటు చర్చలు జరిగాయి. ఇక 2018 డిసెంబరు ఎన్నికల అనంతరం రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల వ్యవధిలో 27 రోజుల పాటు సమావేశాలను నిర్వహించింది. దాదాపు ఆరేళ్ళ వ్యవధిలో కేవలం 153 రోజుల పాటే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

దక్షిణాదిన తెలంగాణలోనే తక్కువ సమావేశాలు:

పొరుగున ఉన్న కర్నాటకలో 2013-18 మధ్యకాలంలో 16 సెషన్లలో 232 రోజుల పాటు జరిగితే కేరళలో 2011-2016 మధ్యకాలంలో (2021లో మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి) 221 రోజుల పాటు జరిగాయి. తమిళనాడులో 2011-16 మధ్య ఐదేళ్ళ కాలంలో 12 సెషన్లలో 165 రోజుల పాటు సమావేశాలు జరిగితే (ప్రస్తుత టర్మ్ ఇంకా పూర్తికాలేదు) ఆంధ్రప్రదేశ్‌లో 2014-19 మధ్యకాలంలో 13 సెషన్లలో 126 రోజుల పాటు జరిగాయి. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలో 31 రోజుల పాటు జరిగితే తెలంగాణలో మాత్రం 15 నెలల వ్యవధిలో 27 రోజులే జరిగాయి.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అసెంబ్లీ సమావేశాలు సరైన వేదిక. కానీ అప్పుడు కూడా కేవలం ప్రశ్నోత్తరాలు లేదా జీరో అవర్‌లో మాత్రమే అలాంటి సమస్యలు సభ దృష్టికి వస్తున్నాయి. మిగిలిన సమయమంతా ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడానికో (అధికార పార్టీ ఎమ్మెల్యేలు) లేక ముఖ్యమంత్రి సుదీర్ఘ ఉపన్యాసానికో సరిపోతున్నాయి. ‘మా గొంతు నొక్కేస్తున్నారు. తగిన సమయం ఇవ్వడంలేదు. మైక్ కట్ చేస్తున్నారు…’ అంటూ ప్రతిపక్ష సభ్యులు మొత్తుకుంటున్నారు. ‘ప్రజలు సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నారు కాబట్టే ఏ ఎన్నికలు జరిగినా మాకే ఓటేస్తున్నారు’ అంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. కానీ సమస్యలు లేవనెత్తే అవకాశం ఇస్తే గదా…’ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నాడు ప్రజల భవన్ … నేడు ప్రగతి భవన్ :
వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతీరోజూ ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలను తీసుకుని వారితో ముచ్చటించేవారు. ఇందుకోసం ఇప్పుడు ప్రగతిభవన్ ఉన్న స్థానంలోనే కొన్ని గంటల సమయాన్ని వెచ్చించేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలను ముఖ్యమంత్రి నేరుగా కలిసే విధానం లేకుండా పోయింది. బహిరంగసభలు లేదా ఎన్నికల ప్రచార సభల్లో మాత్రమే ఆయన ప్రజలను చూసేవారు. లేదా ఏదేని కార్యక్రమాన్ని ప్రారంభించడం లాంటి సందర్భాల్లో మాత్రమే. ప్రజలకు ప్రగతి భవన్‌లోకి వెళ్ళడానికి అనుమతి లేదు. కనీసం ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి మిగిలిన ఏకైక వేదిక అసెంబ్లీ సమావేశాలు. ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించడానికి ఇది ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ అలాంటి అసెంబ్లీ సమావేశాలు జరిగింది చాలా తక్కువ రోజులే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఐదేళ్ళలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే…

అసెంబ్లీ సమావేశాల తీరు ఇలా ఉంటే.. ఎమ్మెల్యేలు అందుకునే జీతాలు మాత్రం మరే రాష్ట్రంలో లేనంత ఎక్కువ ఉన్నాయి. ప్రతీ ఎమ్మెల్యే నెలకురూ. 2.50 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఇక సమావేశాలు జరిగేటప్పుడు రోజువారీ భత్యం, అసెంబ్లీ కమిటీ సమావేశాలకు హాజరయ్యేటప్పుడు ఇచ్చే అలవెన్సు, ఇంటి అద్దెకు ప్రతీ నెలా రూ. 25 వేలు (హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్వార్టర్ తీసుకోకపోతే), వ్యక్తిగత సహాయకుడి జీతం, డ్రైవర్ జీతం… ఇలా లభించేవన్నీ అదనం. ఇక పదవీకాలం ముగిసిన తర్వాత పింఛను, వైద్యారోగ్య సౌకర్యం తదితరాలన్నీ వీరికి లభిస్తున్నాయి. మనం ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే ఫైనాన్స్ ద్వారా 14% వడ్డీ కట్టక తప్పదు. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం 4% వడ్డీకే లభిస్తుంది. ఇక రైలు ప్రయాణాల్లో రాయితీలు, ఉచిత టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు లాంటి వాటి సంగతి సరేసరి.

తెలంగాణ కంటే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న మహారాష్ట్రలో ఎమ్మెల్యేల వేతనం రూ. 2.13 లక్షలు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు వేతనాలు లక్ష రూపాయల లోపే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా అలవెన్సులు, రాయితీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనాలను ఒకసారి పరిశీలిద్దాం.

Tags : Telangana, MLA, Assembly, Salary, Sessions, elections

Tags:    

Similar News