ప్రైవేట్ స్కూల్స్‌కు సర్కార్ ఝలక్.. మీదే బాధ్యత అంటూ ఆదేశాలు జారీ
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను పెంచకుండా కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కొవిడ్ కారణంతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయకుండా స్కూల్ నుంచి డిశ్చార్జ్ చేయాలి. ప్రభుత్వ నిబంధనలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది. పాఠశాలల్లో పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్(ఎస్ఓపీ) విధివిధానాలు మంగళవారం విడులయ్యాయి. పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ప్రభుత్వం స్పష్టం […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను పెంచకుండా కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కొవిడ్ కారణంతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయకుండా స్కూల్ నుంచి డిశ్చార్జ్ చేయాలి. ప్రభుత్వ నిబంధనలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది.
పాఠశాలల్లో పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్(ఎస్ఓపీ) విధివిధానాలు మంగళవారం విడులయ్యాయి. పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పక్కాగా కొవిడ్ నిబంధనలు పాటించి విద్యార్థులకు, సిబ్బందికి వైరస్ సోకకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. విద్యార్థులకు కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయుడు టెస్ట్ చేయించాలి.
విద్యార్థికి పాజిటివ్‌గా తేలితే ఆ తరగతి గదిలో విద్యార్థులందరికీ, టీచర్లకు కూడా టెస్టులు నిర్వహించాలి. పాఠశాల ఆవరణలో వైరస్ వ్యాప్తి జరగకుండా వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. కొవిడ్ సోకిన విద్యార్థులు, సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా, ఎల్లప్పుడు మాస్క్‌లు ధరించేలా కొవిడ్ నిబంధనలు పక్కగా పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఫిజికల్ తరగతులకు హాజరయ్యేందుకు ఇష్టపడని విద్యార్థులను బలవంత పెట్టకూడదు, తల్లిదండ్రులకు పెనాల్టీ వేసే కార్యక్రమాలు చేపట్టరాదు.
చదువులో వెనకబడిన విద్యార్థులపై ఎక్కువగా శ్రద్ధ వహించి టీచర్లు వారిలో విద్యానైపుణ్యాలను పెంపొందించాలి. ఆహ్లదకరమైన వాతావరణంలో విద్యార్థులకు తరగతులు బోధించాలి. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు శుభ్రతను పాటించేలా వంట గది, భోజన గదులు శుభ్రంగా ఉండేలా ప్రధానోపాధ్యాయుడు జాగ్రత్తలు చేపట్టాలి. విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నప్పుడు, తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తప్పనిసరిగా గమనించాలి. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.
తరగతి గదుల్లో విద్యార్థులు పెన్నులను, పుస్తకాలను, వాటర్ బాటిళ్లను, తినుబండారాలను, గ్లాసులు, ప్లేట్లను మార్చుకోవడం వంటి కార్యక్రమాలు జరగకుండా విద్యార్థుల్లో అవగాన చేపట్టాలి. ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చే బస్సులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. మాస్క్ లేని విద్యార్థులను ఎట్టిపరిస్థితుల్లో బస్సుల్లోకి అనుమతించరాదు. ప్రజా రవాణా ద్వారా వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి. పాఠశాల యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.