రాయలసీమ ఎత్తిపోతలను ఆపండి
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా బేసిన్‌లో ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ఇప్పటికే రాయలసీమపై టెండర్లకు దిగిన విషయం తెలిసిందే. వచ్చేనెల 3న టెండర్లు ఓపెన్ చేసి, 10న ఖరారు చేయనున్న నేపథ్యంలో తెలంగాణ దాన్ని అడ్డుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను బోర్డుకు సూచించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రయోజనాలకు […]
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా బేసిన్‌లో ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ఇప్పటికే రాయలసీమపై టెండర్లకు దిగిన విషయం తెలిసిందే. వచ్చేనెల 3న టెండర్లు ఓపెన్ చేసి, 10న ఖరారు చేయనున్న నేపథ్యంలో తెలంగాణ దాన్ని అడ్డుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను బోర్డుకు సూచించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కల్గించే విధంగా ఏపీ ప్రభుత్వం నీటి దోపిడికి పాల్పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, కృష్ణా నదిపై ఆధారపడిన రాష్ట్రాల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, దీనిలో సంగమేశ్వరం దగ్గర రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు పిలిచారని వివరించారు.
గతంలోనే దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని, అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి, అనుమతి తీసుకున్న తర్వాత కొత్త ప్రాజెక్టులను నిర్మించేందుకు ముందుకు సాగాలని చెప్పామన్నారు. కానీ అపెక్స్ నిర్ణయం లేకుండా, కనీసం సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీకి సమాచారం లేకుండా రాయలసీమ నిర్మాణానికి రెడీ అవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలపై ఇరురాష్ట్రాలు ఒప్పందానికి రావాల్సి ఉందని, ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఏపీ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ఒక్క డీపీఆర్ కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై గతంలో కృష్ణాబోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై ముందుకు పోరాదని నోటీసులు కూడా జారీ చేసిన అంశాన్నీ తెలంగాణ ఈఎన్సీ లేఖలో గుర్తు చేశారు.
కానీ కేఆర్ఎంబీ నోటీసులను ఏపీ ప్రభుత్వం పట్టంచుకోకపోవడం దారుణంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీనిపై విచారించిన విషయాన్ని గుర్తుచేశారు. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, కనీసం వాటికి సమాచారం ఇవ్వకుండా రాయలసీమ ఎత్తిపోతలను నిర్మిస్తున్నారని, దీనిపై వెంటనే బోర్డు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఏపీ ప్రభుత్వానికి తగిన విధంగా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ కృష్ణా బోర్డును కోరింది. అత్యవసరంగా భావించి రాయలసీమ టెండర్ల ప్రక్రియను అడ్డుకోవాలని బోర్డుకు సూచించారు.