ప్రమోషన్ ఇచ్చారు.. పోస్టింగ్ ఇవ్వరా..?

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పదోన్నతులు వస్తున్నా… ఉద్యోగులకు ఆ సంబురమే లేకుండా పోతోంది. కొన్ని శాఖల్లో అక్రమార్గంలో పదోన్నతులు కల్పిస్తుంటే… మరికొన్ని శాఖల్లో పోస్టింగ్‎లు ఇవ్వడం లేదు. ఏండ్ల తరబడి ప్రమోషన్ల కోసం.. నెలల తరబడి పోస్టింగ్‎ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతంలో జరిగిన అబ్కారీ నుంచి ఇటీవల జరిగిన పోలీసుల పదోన్నతుల వరకు పోస్టింగ్‎లన్నీ పెడింగ్‎లో ఉన్నాయి. దీనిపై మంత్రులు దగ్గర నుంచి ఆమోదముద్ర రావడం లేదనే ఆరోపణలు […]

Update: 2021-04-15 12:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పదోన్నతులు వస్తున్నా… ఉద్యోగులకు ఆ సంబురమే లేకుండా పోతోంది. కొన్ని శాఖల్లో అక్రమార్గంలో పదోన్నతులు కల్పిస్తుంటే… మరికొన్ని శాఖల్లో పోస్టింగ్‎లు ఇవ్వడం లేదు. ఏండ్ల తరబడి ప్రమోషన్ల కోసం.. నెలల తరబడి పోస్టింగ్‎ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతంలో జరిగిన అబ్కారీ నుంచి ఇటీవల జరిగిన పోలీసుల పదోన్నతుల వరకు పోస్టింగ్‎లన్నీ పెడింగ్‎లో ఉన్నాయి. దీనిపై మంత్రులు దగ్గర నుంచి ఆమోదముద్ర రావడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పలు శాఖల్లో మంత్రులు గ్రీన్​ సిగ్నల్​ఇస్తేనే పోస్టింగ్‎లు బయటకు వస్తాయంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఈ ఏడాది జనవరిలో ఆదేశించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదరుచూస్తున్న కొందరు ఉద్యోగులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల అస్తవ్యస్థ విధానాలతో అవకతవకలు జరుగుతున్నాయని, కొన్ని శాఖల్లో కొందరు పైరవీలతో మంచి పోస్టింగులు సాధిస్తుండగా.. సీనియర్లకు కూడా కొందరికి కోరుకున్న చోటు దొరకడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల జలవనరుల శాఖలో కొంతమంది ఉద్యోగులు కోర్టెకెక్కుతున్నారు. ప్రమోషన్లకు గతంలో మూడేళ్ల సర్వీసు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం దాన్ని రెండేళ్లకు తగ్గించడంతో ఎక్కువ మందికి పదోన్నతులు వస్తున్నాయి. ఇది ఆయా శాఖల్లో అవినీతికి దారి చూపిందనే ఆరోపణలున్నాయి. చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు దక్కడం లేదని, తాత్కాలిక ప్రమోషన్లను కారణంగా చూపి శాశ్వత ప్రమోషన్లను నిలిపేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

పోస్టింగ్​ ఏది..?

మరోవైపు కొన్ని శాఖల్లో పదోన్నతులు వచ్చినా పోస్టింగ్‎​ల కోసం బతిమిలాడుకోవాల్సి వస్తోంది. ఉదాహరణగా సీఎస్​చేతిలో ఉండే వాణిజ్య పన్నుల శాఖలో దాదాపు 750 మందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో కొంతమందిని అవే స్థానాల్లో కంటిన్యూ చేస్తున్నా చాలా మందికి పోస్టింగ్​ఇవ్వడం లేదు. అదే విధంగా అబ్కారీ శాఖలో దాదాపు 4‌‌‌‌00 మందికి పదోన్నతులు కల్పించారు. కానీ ఒక్కరి పోస్టింగ్​కాగితాలు బయటకు రాలేదు. ఏఈఎస్​ నుంచి ఈఎస్‎లకు పదోన్నతులిచ్చారు. సీఐ నుంచి ఏఈఎస్​వాళ్ల జాబితానే సిద్ధం చేయలేదు. పదోన్నతులు కల్పించిన తర్వాత పోస్టింగ్‎​లు ఇచ్చి బదిలీలు చేయాల్సి ఉన్నా కేవలం ప్రమోషన్లకు పరిమితమయ్యారు. అబ్కారీ శాఖలో ఈఎస్‎​లుగా పదోన్నతులు వచ్చినా ఇంకా పాతస్థానాల్లోనే ఉన్నారు. రెవెన్యూలో పరిస్థితి కూడా అంతే. రిజిస్ట్రేషన్ల శాఖలో డిసెంబర్​నుంచి పోస్టింగ్‎​లు లేవు. పోస్టింగ్‎​ల కోసం కూడా మార్పులు తీసుకువస్తామంటూ రాష్ట్ర ఉన్నతాధికారి ఫైల్‎​ను పెండింగ్​పెట్టినట్లు చెబుతున్నారు. అటు సచివాలయ ఉద్యోగుల్లో కూడా అంతే. వారికి కూడా పోస్టింగ్‎​లు ఇవ్వడం లేదు. తాజాగా పోలీస్​శాఖలో సీఐల నుంచి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చినా వారు ఎక్కడ కూర్చుండాలో ఇంకా తెలియడం లేదు.

మంత్రులకు సమయం లేదుగా..!

మరోవైపు పోస్టింగ్‎​ల కోసం మంత్రులదే తుది నిర్ణయమని అధికారవర్గాలు బాహాటంగానే పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పదోన్నతులు వచ్చిన వారిని ఎక్కడెక్కడ భర్తీ చేయాలనే అంశంపై మంత్రులకు తీరిక లేదని చెబుతున్నారు. మంత్రులు చెప్పకపోవడంతో వారి పోస్టింగ్​ ఉత్తర్వులు సిద్ధం చేయడం లేదు. మంత్రులు ఖరారు చేసిన తర్వాతే పోస్టింగ్‎​లు వస్తాయంటూ స్పష్టంగా తెలియజేస్తున్నారు. పోలీస్‎​తో పాటు రెవెన్యూ, అబ్కారీ శాఖల్లో ఇది మరింత ఎక్కువగా ఉందంటున్నారు. ఇటీవల సీఎస్‎​కు కూడా కరోనా పాజిటివ్​రావడంతో హోం ఐసోలేషన్‎​కు వెళ్లారు. తాజాగా ఆయన గురువారం విధుల్లోకి వచ్చారు. ఇప్పుడైనా పోస్టింగ్‎​లు ఇస్తారా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News