గవర్నర్ గారూ..జర ‘గాంధీ’ని చూడరూ!
ఏమాటకామాటే చెప్పుకోవాలి. గుళ్లు, గోపురాలు తిరగడమే కాదు..పేదల పెద్దాసుపత్రి ‘గాంధీ’కి కూడా కడపటి గవర్నర్ సీఎల్ నరసింహన్ తరచూ వెళ్లి వస్తుండేది. అంతేనా.. తాను కూడా అక్కడే వైద్యం చేయించుకునేది. సీఎం అటుంచి, మంత్రుల కంటే ఎక్కువగా తానే తనిఖీలు చేపడుతూ.. సర్కారీ దవాఖానాల్లో క్రమశిక్షణను అలవాటుచేసి జనాల్లో ఒకింత నమ్మకాన్ని, పాజిటివ్ ఇమేజ్‌ను నెలకొల్పేది. మరి తన బెస్ట్ ఫ్రెండ్ కమ్ వెల్‌విషర్ నరసింహన్‌ను సీఎం కేసీఆర్ మరిచారో, గుర్తుంచుకున్నారో తెలియదు. కానీ, ‘గాంధీ’లోని వ్యవహారాలు […]
ఏమాటకామాటే చెప్పుకోవాలి. గుళ్లు, గోపురాలు తిరగడమే కాదు..పేదల పెద్దాసుపత్రి ‘గాంధీ’కి కూడా కడపటి గవర్నర్ సీఎల్ నరసింహన్ తరచూ వెళ్లి వస్తుండేది. అంతేనా.. తాను కూడా అక్కడే వైద్యం చేయించుకునేది. సీఎం అటుంచి, మంత్రుల కంటే ఎక్కువగా తానే తనిఖీలు చేపడుతూ.. సర్కారీ దవాఖానాల్లో క్రమశిక్షణను అలవాటుచేసి జనాల్లో ఒకింత నమ్మకాన్ని, పాజిటివ్ ఇమేజ్‌ను నెలకొల్పేది. మరి తన బెస్ట్ ఫ్రెండ్ కమ్ వెల్‌విషర్ నరసింహన్‌ను సీఎం కేసీఆర్ మరిచారో, గుర్తుంచుకున్నారో తెలియదు. కానీ, ‘గాంధీ’లోని వ్యవహారాలు మాత్రం మన లాంగ్ టర్మ్ మాజీ గవర్నర్‌ను యాది చేస్తున్నాయి. ఒకవేళ ఆయనుంటే, గాడి తప్పిన గాంధీ హాస్పిటల్‌లో ఉన్నపళంగా ప్రత్యక్షమయ్యేవారేమో! అసలు గాంధీలోనే అలజడి రేగేది కాదేమో! గాంధీ సాక్షిగా సాక్షాత్తూ ఓ డాక్టరే కడుపునకు పెట్రోలు బాటిళ్లు కట్టుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడమేంటీ ? అసలే సర్కారీ దవాఖానాలంటే పెదవి విరుపు ముద్ర ఉండనే ఉన్నది. పైగా ఇట్లాంటి అన్‌వాంటెడ్ ఇన్సిడెంట్లు ఎంత లేదన్నా ప్రతిష్టను మసకబార్చుతాయనడంలో సందేహం లేదు.
పరస్పర ఆరోపణలు..పైసల పంపకాలే మూలాలు?
డాక్టర్ జి.వసంత్ కుమార్. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) గాంధీ యూనిట్ జనరల్ సెక్రటరీ. శానిటేషన్, సెక్యూరిటీ, ఫార్మసీల్లో స్కాములున్నాయని గొంతెత్తారు. ఆ దందాల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్‌తో పాటు వైద్య విద్య సంచాలకుడు(డీఎంఈ) రమేశ్‌రెడ్డి వైపు డా.వసంత్ వేలు చూపెట్టింది! ఈ ఆరోపణలపై స్పందించిన డీఎంఈ..ఆధారాలు చూపాలని ఛాలెంజ్ చేస్తున్నారు. పైగా, డా.వసంత్ ఓ ‘బ్లాక్ మెయిలర్’ అంటూ కౌంటరిచ్చారు. కరోనా(లేటెస్ట్ పేరు ‘కొవిడ్-19’)పై ఎక్స్‌పర్ట్స్ మీటింగ్‌లో లొల్లి చేసినందున డా. వసంత్‌ను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్)కు సరెండర్ చేసినట్టు ప్రకటించారు. ఆ చర్యను జీర్ణించుకోని డా.వసంత్..తనకు వెన్నుపోటు పొడిచారని ఆత్మహత్యాయత్నం చేశారు. నిన్నటి ఆ ట్విస్ట్ గాంధీ హాస్పిటల్ అండ్ వైద్య విద్య విభాగం పెద్దలను ఇరకాటంలో పడేసింది. ఆయన సూసైడ్ అటెంప్ట్ ఊహించనిదైంది. తనపై నింద మోపిన దరిమిలా, క్రమశిక్షణ చర్యలుంటాయంటూ డీఎంఈ ఘాటుగా రియాక్టయ్యారు. ఒకవేళ అదే నిజమైతే, ఈ వివాదం కంటిన్యూ అవుతుందన్నమాట!
‘గాంధీ’లో గప్ చుప్!
మంగళవారంనాటి కలకలం బుధవారం గుప్ చుప్‌కు కారణమైంది. ఆ వివాదంపై స్పందించడానికి కీలక విభాగాల బాధ్యులు ముందుకు రాలేదు. అంతా గుంభనంగా, గంభీరమైన వాతావరణం నెలకొన్నది. ఓపెనైతే, ఎవరి మెడకు ఏమి చుట్టుకుంటదోనని మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. కొన్ని విభాగాల సిబ్బంది మాత్రం నిన్నటి సంఘటనను మొబైల్ ఫోన్లలో ఇంట్రెస్టింగ్‌గా చూస్తుండటం కనిపించింది. పగలు వరకైతే సూపరింటెండెంట్ పేషీలో లేరు. డా.వసంత్ రిలీవయ్యారా, లేదా? క్లారిటీ లేదు. అన్ ఈజీగా ఉన్న ఆయన ఇవాళ ఇంట్లోనే ఉన్నట్టున్నారు.
నిగ్గు తేల్చుతారా! నిర్వీర్యం చేస్తారా?
శానిటేషన్, సెక్యూరిటీ, ఫార్మసీ, క్యాంటిన్లు వంటి వాటిల్లో మతలబులుంటాయనేది కొత్తేమీ కాదు. కానీ, ఒక డాక్టరే బహిరంగంగా ఆరోపణలు చేయడం అంత లెక్కలోనికి తీసుకోనిదేమీ కాదు. సీరియస్‌గా పరిగణించాల్సిన మేటరే. నిజానిజాల నిగ్గు తేల్చుతారా, లేక మొత్తం ఎపిసోడ్‌ను నిర్వీర్యం చేస్తారా? చూడాలి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయానా డాక్టర్, బీదల పక్షపాతి. అదే గరీబులకు అసలు దిక్కయిన ‘గాంధీ’లో లుకలుకలపై నజర్ పెట్టాలి. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. క్వాలిటీ సర్వీసెస్, క్రమశిక్షణ కంపల్సరీ చేయాలి. తాజా వివాదాలపై మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటుతో సంబంధం లేని అవతలి శాఖ హయ్యర్ ఆఫీసర్లతో లోతైన ఎంక్వయిరీ చేయించాలి. అసలే కొవిడ్-19 నీడలా వెంటాడుతున్న రోజులు! మరోవంక ఈఎస్‌ఐపై మాదిరిగా ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తుందా లేక రొటీన్‌గానే వదిలేస్తుందా? ఏమో!