కేంద్రం ఎంతిస్తుందో అని ఎదురుచూపులు..!
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన సమర్పించనున్న బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా శాఖలవారీ కసరత్తు కూడా మొదలు పెట్టలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంతవరకు బడ్జెట్ ప్రిపరేషన్ కోసం సర్క్యులర్ కూడా జారీ చేయలేదని ఓ అధికారి తెలిపారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏయే పథకాలకు ఎలాంటి కేటాయింపులు చేస్తుంది, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు దక్కే అవకాశం ఉంది, ఏయే పథకాలపై కేంద్ర […]
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన సమర్పించనున్న బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా శాఖలవారీ కసరత్తు కూడా మొదలు పెట్టలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంతవరకు బడ్జెట్ ప్రిపరేషన్ కోసం సర్క్యులర్ కూడా జారీ చేయలేదని ఓ అధికారి తెలిపారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏయే పథకాలకు ఎలాంటి కేటాయింపులు చేస్తుంది, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు దక్కే అవకాశం ఉంది, ఏయే పథకాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుంది తదితరాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే రాష్ట్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను మొదలు పెట్టాలనుకుంటున్నట్లు ఆ అధికారి తెలిపారు.
కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు రోజు విడుదల చేసే ‘ఎకనామిక్ సర్వే’లోని అంశాలను కూడా అధ్యయనం చేయాలనుకుంటోందన్నారు. ఏయే రంగాలలో ఎంత వృద్ధి రేటు నమోదైందో తెలుసుకున్న తర్వాత ఆయా రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంపై స్పష్టత వస్తుందని ఆ అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ సైజును ఖరారు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరుల్లో దాదాపు 52 వేల కోట్ల మేర వెలితి ఏర్పడినందున ఈసారి ఆ మేరకు సైజు తగ్గుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
చివరి క్వార్టర్‌లో మెరుగైన ఆర్థిక పరిస్థితి
కరోనా కారణంగా దాదాపు నాలుగైదు నెలల పాటు లాక్‌డౌన్, అన్‌లాక్ ఆంక్షలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో స్వీయ ఆర్థిక వనరులను కోల్పోయింది. ఒకవైపు జీఎస్టీ, మరోవైపు వాణిజ్య పన్నుల ఆదాయాన్ని కోల్పోవడంతో అక్టోబరు చివరి నాటికి సుమారు రూ.52 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ నవంబరు నుంచి ఆర్థిక పరిస్థితి కాస్త పుంజుకోవడంతో నష్టం మొత్తం భర్తీ కాకపోయినప్పటికీ ఒక మేరకు పుంజుకున్నట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. గత వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూ.1.83 లక్షల కోట్లతో రూపొందించినప్పటికీ అందులో సుమారు రూ.1.43 లక్షల కోట్లు వివిధ రకాల పన్నుల ద్వారా సమకూరేదే. రాష్ట్రానికి పన్నుల రూపంలో రూ.50 వేల కోట్లు కూడా రాలేదని, మార్చి నెల చివరి నాటికి పరిస్థితి కొంత మెరుగుపడుతుందన్న నమ్మకం ఉందని ఆ అధికారి పేర్కొన్నారు.
సుమారు రూ.52 వేల కోట్ల మేర లోటు ఏర్పడినందున అంత ఎక్కువగా బడ్జెట్ సైజు తగ్గకపోవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. కేంద్ర బడ్జెట్ ‘పింక్ బుక్’లోని అంశాలను అధ్యయనం చేయడానికి, రాష్ట్రానికి ఎంత వస్తుందో తేల్చడానికి కనీసంగా వారం రోజుల సమయం పడుతుంది కాబట్టి అప్పుడు రాష్ట్ర బడ్జెట్ తయారీ కోసం సర్క్యులర్ జారీ, కసరత్తు మొదలవుతాయని ఆ అధికారి వివరించారు. ఎలాగూ మార్చి రెండో వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి తయారీ కోసం నెల రోజుల సమయం సరిపోతుందని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి ఏ పథకానికి ఎంత చొప్పున రాష్ట్రానికి ఏ మేరకు నిధులు అందుతాయనే ఆశలతో పాటు ఎఫ్ఆర్‌బీఎం పరిధి ఎలాగూ 4.50% వరకు (జీఎస్‌డీపీలో) పరిమితి ఉన్నందున రుణాలు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దాదాపుగా గతేడాది బడ్జెట్‌కు కొంచెం అటు ఇటుగా సమానమైన బడ్జెట్టే ఉంటుందని, అయితే ప్రతీ ఏడాది కనిపిస్తున్న 14% మేర వృద్ధి రేటు ఈసారి కనిపించకపోవచ్చన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుతున్నా వృద్ధి రేటు మాత్రం పెద్దగా ఉండకపోవచ్చని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.