నెలాఖరు వరకూ జిల్లా కోర్టులు బంద్
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు పరిధిలో పనిచేసే జిల్లా కోర్టులతో పాటు సబార్డినేట్ కోర్టులు, ట్రిబ్యునళ్ళు, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్-ఆర్బిట్రేషన్ సెంటర్లు, లీగల్ సర్వీసెస్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ తదితరాలన్నీ ఈ నెల 30 వరకు పనిచేయవని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శనివారం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి ఈ కోర్టులన్నీ పనిచేసుకోవచ్చంటూ ఈ నెల 6వ […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు పరిధిలో పనిచేసే జిల్లా కోర్టులతో పాటు సబార్డినేట్ కోర్టులు, ట్రిబ్యునళ్ళు, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్-ఆర్బిట్రేషన్ సెంటర్లు, లీగల్ సర్వీసెస్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ తదితరాలన్నీ ఈ నెల 30 వరకు పనిచేయవని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శనివారం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి ఈ కోర్టులన్నీ పనిచేసుకోవచ్చంటూ ఈ నెల 6వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. హైదరాబాద్ నగరంలోనేకాక అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడం, వైద్య సిబ్బందిపై భారం పడుతుండడం, కోర్టులు పనిచేయడం ద్వారా వైరస్ వ్యాప్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ నెల 30వ తేదీ వరకూ క్రిందిస్థాయి కోర్టులు పనిచేయకుండా మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. లాక్‌డౌన్ జూన్ 30 వరకూ కొనసాగుతున్నందున క్రిందిస్థాయి కోర్టుల్ని కూడా అప్పటివరకూ తెరవరాదనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర హైకోర్టు సైతం అత్యవసరమైన కేసుల్ని మాత్రమే విచారిస్తుందని పేర్కొన్నారు. జడ్జిలు కోర్టుకు వస్తారని, న్యాయవాదులు మాత్రం వీడియో కాన్ఫరెన్సు ద్వారా వాదనలు వినిపిస్తారని పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ మాత్రం ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు దిగువ కోర్టుల్లో పిటిషన్ల విచారణ వాయిదాలన్నీ ఆ తర్వాతి తేదీలకు మారుతాయని స్పష్టం చేశారు. తదుపరి విచారణ జరిగే తేదీల వివరాలన్నీ వెబ్‌సైట్ ద్వారా వెల్లడించనున్నట్లు తెలిపారు.