కొత్తగూడెం డీఎస్పీపై ‘కరోనా’ కేసు
దిశ, న్యూస్‌బ్యూరో: విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చిన విషయాన్ని దాచిపెట్టడంతోపాటు పలువురికి వ్యాప్తి చేసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ విదేశీ ప్రయాణం చేసి వచ్చిన ప్రతీ ఒక్కరూ నిర్బంధంగా 14 రోజులపాటు ‘క్వారంటైన్’లో ఉండాలని నిబంధన విధించినా దాన్ని ఉల్లంఘించినందుకు డీఎస్పీపై కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. విదేశీ ప్రయాణం చేసివచ్చిన డీఎస్పీ కుమారుడు క్వారంటైన్‌లో […]
దిశ, న్యూస్‌బ్యూరో: విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చిన విషయాన్ని దాచిపెట్టడంతోపాటు పలువురికి వ్యాప్తి చేసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ విదేశీ ప్రయాణం చేసి వచ్చిన ప్రతీ ఒక్కరూ నిర్బంధంగా 14 రోజులపాటు ‘క్వారంటైన్’లో ఉండాలని నిబంధన విధించినా దాన్ని ఉల్లంఘించినందుకు డీఎస్పీపై కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. విదేశీ ప్రయాణం చేసివచ్చిన డీఎస్పీ కుమారుడు క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరిగారు. ఒక వివాహ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. లక్షణాలు బైటపడడంతో పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. చివరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీని వరంగల్‌లోని క్వారంటైన్‌లో ఉంచారు. వైరస్ వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవడానికి బదులుగా రోడ్డుమీదకు వచ్చి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. క్వారంటైన్‌లో ఉండాల్సినవారు రోడ్లమీదకు వచ్చినందుకు మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరుకుంది. సోమవారం మధ్యాహ్ననికి మూడు కేసులు నమోదు కాగా సాయంత్రానికి మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు ఫ్రాన్స్, మరొకరు లండన్ నుంచి వచ్చినవారుగా తేలింది. ఇంకొకరు కరీంనగర్ జిల్లాలో ఇటీవల మతప్రచారం నిర్వహించిన ఇండోనేషియాకు చెందినవారి నుంచి స్థానికులకు అంటుకున్నట్లు తేలింది. సాయంత్రానికి కొత్తగా నమోదైన మూడు కేసుల్లో ఒకరు న్యూయార్క్, మరొకరు లండన్, ఇంకొకరు శ్రీలంక నుంచి వచ్చినవారుగా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం 33 కేసుల్లో 31 విదేశీ ప్రయాణం చేసినవచ్చినవారు కాగా ఇద్దరు మాత్రం అలాంటివారితో సంబంధాలు కలిగి ఉన్నందున వారి ద్వారా పాజిటివ్ అయినవారు.
Tags : Telangana, Corona, Foreign tours, total positive 33, Kothagudem, DySP