తప్పిన ప్రభుత్వ అంచనా !
దిశ, న్యూస్ బ్యూరో: ఆర్థిక మందగమనం ఏడాదిన్నరగా ఉంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగ్గానే అంచనా వేశారు. అనేక జాగ్రత్తలూ తీసుకున్నారు. అందుకే గతేడాది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సందర్భంగా వేసిన అంచనాలకు భిన్నంగా ‘వాస్తవిక బడ్జెట్’ పేరుతో మొత్తం సైజును రూ. 1.82 లక్షల కోట్ల నుంచి రూ. 1.46 లక్షల కోట్లకు తగ్గించుకున్నారు. అయినా సుమారు రూ. 2044 కోట్ల మేర రెవిన్యూ మిగులు బడ్జెట్ ఉంటుందని అంచనా వేశారు. అయితే అక్కడే కేసీఆర్ అంచనా […]
దిశ, న్యూస్ బ్యూరో:
ఆర్థిక మందగమనం ఏడాదిన్నరగా ఉంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగ్గానే అంచనా వేశారు. అనేక జాగ్రత్తలూ తీసుకున్నారు. అందుకే గతేడాది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సందర్భంగా వేసిన అంచనాలకు భిన్నంగా ‘వాస్తవిక బడ్జెట్’ పేరుతో మొత్తం సైజును రూ. 1.82 లక్షల కోట్ల నుంచి రూ. 1.46 లక్షల కోట్లకు తగ్గించుకున్నారు. అయినా సుమారు రూ. 2044 కోట్ల మేర రెవిన్యూ మిగులు బడ్జెట్ ఉంటుందని అంచనా వేశారు. అయితే అక్కడే కేసీఆర్ అంచనా తప్పింది. సవరించిన అంచనాల ప్రకారం చూస్తే చివరకు రెవిన్యూ మిగులు తేలింది కేవలం రూ. 103 కోట్లు మాత్రమే. అంటే సుమారు రూ. 2000 కోట్ల మేర కేసీఆర్ లెక్క తప్పింది. దానికి ముందు ఏడాది సైతం ఇదే తీరులో అంచనా తప్పింది. అప్పుడు ఆర్థిక మాంద్యం అనే అంశమే ఉనికిలో లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 5,520 కోట్ల మేర రెవిన్యూ మిగులు ఉండొచ్చని అంచనా వేశారు. కానీ సవరించిన అంచనాల ప్రకారం ఆ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెవిన్యూ మిగులుగా తేలింది కేవలం రూ. 72 కోట్లే. అంటే వరుసగా రెండేండ్లూ కేసీఆర్ రెవిన్యూ మిగులు అంచనా తప్పింది.
కేంద్రం నుంచి రావాల్సిన డివొల్యూషన్ (కేంద్ర పన్నుల వాటా) తగ్గిందని సమర్ధించుకుంటున్నారు. జీఎస్టీ పరిహారం రూపంలో రాష్ట్రానికి రావాల్సింది తగ్గిపోయిందన్నారు. ఇంకా కేంద్రం దగ్గర రూ. 933 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. ఈసారి కూడా కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు వేర్వేరు రూపాల్లో ఆర్థిక సాయం ఆశించినంతగా రాకపోవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అయినా సుమారు రూ. 4,482 కోట్ల మేర రెవిన్యూ మిగులు ఉంటుందని అంచనా వేసింది. ఈ బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు రెవిన్యూ మిగులు ఉంటుందా లేక అక్కడికక్కడికే ఆదాయం, ఖర్చులు సరిపోతాయా అనేది వచ్చే బడ్జెట్ నాటికి తేలిపోతుంది.
tags: Telangana, Budget, Revenue, Surplus, Devolution