పొంగులేటి బీజేపీలో చేరుతారా..? ఈటల రాయబారం ఫలిస్తుందా..?
దిశ ప్రతినిధి, ఖమ్మం: అధికార పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న సీనియర్లను 2023 ఎన్నికలలోగా తమ పార్టీలోకి ఆహ్వానించి అన్ని జిల్లాలపై పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఫోకస్ చేసినట్లు మళ్లీ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికార పార్టీ నుంచి ఇటీవలే కమలం కండువా కప్పుకున్న […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: అధికార పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న సీనియర్లను 2023 ఎన్నికలలోగా తమ పార్టీలోకి ఆహ్వానించి అన్ని జిల్లాలపై పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఫోకస్ చేసినట్లు మళ్లీ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికార పార్టీ నుంచి ఇటీవలే కమలం కండువా కప్పుకున్న ఈటల రాజేందర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైతం ఎలాగైనా సరే పొంగులేటిని తమ పార్టీలోకి లాగాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్న శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తే, ఆయనతో పాటు మరికొంతమంది పెద్ద నేతలు సైతం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాలో కూడా బీజేపీ బలం పుంజుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో ఆరు నుంచి ఏడు సీట్లు రాబట్టుకునేందుకు అవకాశం ఉందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం
మళ్లీ సోషల్ మీడియాలో ప్రచారం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కేడర్ ఉండి బలమైన నేతగా ఉన్న పొంగులేటిని టీఆర్ఎస్ కొంతకాలంగా పక్కకు పెట్టడంతో కాషాయ నేతలు తమ పార్టీలోకి లాగేందుకు ఎప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇటీవల పార్టీలో పలు పరిణామాలు జరగడం, నేతల మధ్య విభేదాలు బయటపడిన విషయాన్ని అధిష్టానం దృష్టికి వెళ్లడంతో స్వయంగా యువనేత కేటీఆర్ రంగంలోకి దిగి సర్దిచెప్పారు. అంతేకాదు పొంగులేటికి కేటీఆర్ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగానే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ఊసే లేదు. ఇటీవల టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో.. స్వయంగా ఈటల రాజేందరే రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గతంలోనే పెద్దల హామీ?
గతంలోనే పొంగులేటిని పార్టీలోకి లాగేందుకు ఢిల్లీ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ కల్పిస్తామని, పొంగులేటితో పాటు జిల్లాలోని ఆయన అనుచరులకు కూడా సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే మంచి పొజిషన్ ఇస్తామని, లేకుంటే కేంద్రంలోనైనా ఏదైనా పదవి ఇచ్చేలా మంతనాలు జరిపారని కూడా రెండు పార్టీల్లో చర్చ జరిగింది. అయినా పొంగులేటి అప్పట్లో వేచి చూసే ధోరణి ప్రదర్శించారు. మళ్లీ టీఆర్ఎస్ నుంచి హామీలు రావడంతో వెనక్కి తగ్గినట్లు పొంగులేటి అత్యంత సన్నిహితులే చర్చించుకోవడం గమనార్హం.
కేడర్ ఒత్తిడి
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొంగులేటికి బలమైన క్యాడర్ ఉంది. ఆయనకు అభిమానులూ ఎక్కువే. ఈ క్రమంలో తమ అభిమాన నేత ఏ పదవి లేకుండా పార్టీలో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి నుంచి మాటిచ్చి తప్పుతున్న టీఆర్ఎస్ వైఖరి పట్ల నిరసనలు కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగినప్పుడు కచ్చితంగా పార్టీ మారాలని, ఇదే సరైన సమయంగా భావించి మంచి నిర్ణయం తీసుకోవాలని పొంగులేటి అనుచరులు ఒత్తిడి సైతం చేశారు. టీఆర్ఎస్‌లో ఉంటే ఎప్పటికైనా న్యాయం జరగదని, ఇప్పటికైనా ఓ నిర్ణయం తీసుకోవాలని పొంగులేటి వర్గీయులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు.
కొట్టిపారేసిన నేత..
బీజేపీలో చేరికపై ప్రచారం జరిగినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ విషయాన్ని పదేపదే ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, టీఆర్ఎస్‌తోనే ఉంటానని ప్రకటించారు. యువనేతపై తనకు నమ్మకం ఉందని, ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌ను వదిలి పెట్లే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు. దీంతో అప్పట్లో జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు మళ్లీ బీజేపీ గాలం వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈసారైనా పదవి వచ్చేనా?
ఇప్పుడు రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలో సీనియర్ల పోటీ పడుతున్నారు. ఇప్పటికైనా తమ నేతకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి కేటాయించాలని పొంగులేటి అభిమానులు కోరుతున్నారు. లేకుంటే తమనేత ఎప్పటికైనా ఓ నిర్ణయం తీసుకుంటారని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. అయితే జిల్లాలో మరో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం మంత్రి పదవికోసం మంతనాలు చేస్తున్నారని, అయితే ఒకవేళ జిల్లాకు ఆ అవకాశమే వస్తే పొంగులేటికే చాన్స్ ఉంటుందనేది విశ్లేషకుల మాట. అయితే ఇప్పటికే అజయ్ మంత్రిగా వ్యవహరిస్తున్నందున మళ్లీ మంత్రి పదవికి చాన్సే లేదని మరో వర్గం నేతలు చెబుతున్నారు.