హైదరాబాద్‌లో అడ్వాన్స్డ్ వెపన్స్
అత్యాధునిక ఆయుధాల తయారీ హబ్‌గా హైదరాబాద్...
హైదరాబాద్ ఇప్పుడు అత్యాధునిక ఆయుధాల తయారీకి హబ్‌గా మారుతున్నది. డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)తో కలిసి ప్రైవేటు సంస్థలు ఆయుధ తయారీలో దూసుకుపోతున్నాయి. భారత్ ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రకటనతో డిఫెన్స్ రంగంలో ప్రైవేటు సంస్థలు వినూత్నమైన ఆవిష్కరణలు సాధిస్తున్నాయి. ఈ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా సంస్థలు అద్భుతాలను సృష్టిస్తున్నాయి.
జెన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (జెడ్ఏడీఎస్)
తాజాగా హైదరాబాద్‌కి చెందిన మరో సంస్థ యాంటీ డ్రోన్ సిస్టమ్ (ఏడీఎస్)ని ఆవిష్కరించింది. జెన్ టెక్నాలజీస్ రూపొందించిన ఈ సిస్టమ్ అనుమతి లేని ప్రదేశాల్లోకి డ్రోన్ రావడాన్ని ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంనుంచే గుర్తిస్తుంది. ఆ దిశగా సిగ్నల్స్‌ని జామ్ చేసేలా జామర్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. మరోవైపు ఆ డ్రోన్‌ని కెమెరాలో గుర్తిస్తుంది. అది ఎంత ఎత్తులో ఉన్నది..? ఎంత బరువుతో ఉన్నది? అన్న విషయాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కి చేరవేస్తుంది.
జామర్‌తో డ్రోన్ దాడులకు చెక్
ఈ ఏడీఎస్‌లో ముందుగా రాడార్ నిర్దేశిత ప్రాంతంలో ఎగురుతున్న వస్తువులను గుర్తిస్తుంది. ఆ వెంటనే వీడియో బేస్డ్ డ్రోన్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకర్ ఆ వస్తువు ప్రమాదమా? కాదా? అన్న విషయాన్ని వీడియో ద్వారా గుర్తిస్తుంది. ప్రమాదమని కమాండ్ సెంటర్ నిర్దేశించగానే.. ఓమ్ని అండ్ డైరెక్షన్ జామింగ్ యాంటెన్నా, రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) యాంటెన్నా సిస్టమ్ యాక్టివేట్ అయి ఆ డ్రోన్ ఇంటర్నెట్ కనెక్షన్, సిగ్నల్స్‌ను నిలిపివేస్తుంది. దీంతో ఆ డ్రోన్ అక్కడికక్కడే నేలకూలుతుంది.
ఎయిర్ డిఫెన్స్ గన్ (L- 70)
ఆ డ్రోన్ ప్రమాదకర పేలుడు పదార్థాలను మోసుకువస్తున్నట్టు గుర్తిస్తే దానిని గాలిలోనే పేల్చివేసేలా ఈ వ్యవస్థకు ఎయిర్ డిఫెన్స్ గన్ (L- 70)ను అనుసంధానం చేశారు. కిలోమీటర్ల దూరంలోని వస్తువును కూడా పక్కాగా పేల్చివేసే ఈ గన్‌తో కచ్చితమైన డైరెక్షన్‌తో డ్రోన్ నేలకూల్చవచ్చు. ఇది బోర్డర్‌లోనే కాక పార్లమెంట్ సహా జనసమ్మర్థ ప్రాంతాల్లోనూ సులువుగా ఇన్స్టాల్ చేయవచ్చు. ఈ వ్యవస్థని ఒక వ్యాన్‌లో అమర్చి దానినే కమాండ్ సెంటర్‌గా మార్చడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే ఈ వ్యవస్థను పరిశీలించారు. అతి త్వరలోనే ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ భారత సైన్యం అమ్ముల పొదలో చేరనున్నది. మారుతున్న యుద్ధ పరిస్థితుల్లో డ్రోన్ దాడులతో భారీగా నష్టం చేకూరుతుండటంతో భారత్ ముందుగా అలర్ట్ అయి నిరోధక వ్యవస్థను తయారుచేసుకోవడంపై మాజీ సైన్యాధికారులు, నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏడీఎస్లోని ముఖ్యమైన వ్యవస్థలు
1. ఎక్స్ బ్యాండ్ 2డీ/3డీ రాడార్
2. ఓమ్ని అండ్ డైరెక్షన్ జామింగ్ యాంటెన్నా
3. రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) యాంటెన్నా సిస్టమ్
4. వీడియో బేస్డ్ డ్రోన్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకర్
5. ఎయిర్ డిఫెన్స్ గన్ (L- 70)
ఉగ్రం.. వండర్ఫుల్ వెపన్
ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఇప్పటికే డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)తో కలిసి ఉగ్రం అనే సూపర్ వెపన్ ని రూపొందించింది. ఏకే 47ని మించిన శక్తి దీనికి ఉందని.. ఇండియన్ ఆర్మీకి ఇదే బెస్ట్ వెపన్ అని నిపుణులు చెబుతున్నారు.