ప్రమోషన్లు ఇప్పట్లో లేనట్లే!

దిశ ప్రతినిధి,మహబూబ్‌నగర్: పాఠాలు చెప్పే పంతుళ్లకు ఇప్పట్లో పదోన్నతలు, బదిలీలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. పీఆర్సీ, సెగ్మెంట్ వంటి బెనిఫిట్ లు, పదోన్నతులు, బదిలీలు లేక నిరాశతో ఉన్న ఉపాధ్యాయులందరికీ గత నెల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్సాహాన్ని కలిగించింది. జనవరి నెలాఖరు వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తామని చెప్పిన హామీతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను, ఖాళీల వివరాలను ఆయా […]

Update: 2021-02-04 20:23 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్‌నగర్: పాఠాలు చెప్పే పంతుళ్లకు ఇప్పట్లో పదోన్నతలు, బదిలీలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. పీఆర్సీ, సెగ్మెంట్ వంటి బెనిఫిట్ లు, పదోన్నతులు, బదిలీలు లేక నిరాశతో ఉన్న ఉపాధ్యాయులందరికీ గత నెల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్సాహాన్ని కలిగించింది. జనవరి నెలాఖరు వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తామని చెప్పిన హామీతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను, ఖాళీల వివరాలను ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. సీనియారిటీ, జాబితాలను ప్రకటించి అభ్యంతరాలను కూడా స్వీకరించి తుది జాబితాలను ఆగమేఘాలపై రూపొందించారు. రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పదోన్నతులు బదిలీల ప్రక్రియ నిర్వహణకు సంసిద్ధమయ్యారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా బదిలీలు, ప్రమోషన్లు ప్రక్రియ సజావుగా సాగుతుందని భావించినా ఆ దిశగా సాగడం లేదు.

పరిగెత్తి.. ఉసూరుమన్నారు..

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు సంబంధించిన వివరాలను తక్షణమే రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో, సంబంధిత అధికారులు ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగమేఘాలపై ఆయా జిల్లాల డీఈఓలు వివరాలను సేకరించారు. రాత్రింబవళ్ళు సీనియార్టీ జాబితాలను రూపొందించి వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యంతరాలను సైతం స్వీకరించి వాటిని సరి చేశారు. ఈ పక్రియ అంత వారం పది రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఏక్షణమైనా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావచ్చునని అధికార యంత్రాంగంతో పాటు ఉపాధ్యాయులు ఎంత ఎదురు చూశారు. కానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఉత్సాహమంతా ఉసూరుమన్నట్లు తయారయింది.

ఇప్పట్లో లేనట్లే..

ఇప్పట్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఉండకపోవచ్చునని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఈ భావనను నిజం చేసేటట్లుగానే ఉపాధ్యాయుల పీఆర్సీ, బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ పత్రికల్లో కథనాలు రావడం, ఆ కథనంలో ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండటం వల్ల బదిలీలు, పదోన్నతుల అంశంపై నుంచి తమ దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ఈ నాటకం ఆడిందని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ నెల రెండో వారంలో గానీ, మూడో వారంలో గానీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో బదిలీలు, పదోన్నతుల ఊసే ఉండకపోవచ్చునని ప్రచారం జరుగుతున్నది. ఈ ఎన్నికల తతంగం ముగిసేలోపు గానే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు, పలు జిల్లాలలో మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికలు ముగియడానికి ఐదారు నెలల సమయం పడుతుంది. అంతవరకు తమకు బదిలీలు, పొదోన్నతులు జరుగకపోవచ్చునని తెలుస్తున్నది.
ప్రభుత్వం వెనుకడుగు..

ప్రభుత్వం వివిధ శాఖల ఉద్యోగులకు నిర్ణీత గడువులోగా పదోన్నతులను కల్పించింది. కానీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడానికి అనేక కారణాలు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు చేస్తే మరింత వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నది. రానున్న ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని ఈ మేరకు వెనకడుగు వేసినట్లు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించే ప్రమాదం ఉండటం, భాషా పండితులు, పీఈటీల సమస్యలు ఉండటం తదితర కారణాలతో ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News