మొనగాళ్ళ సంఘం ఎక్కడుంది..? ఎమ్మెల్సీలపై టీచర్ల ఆగ్రహం
దిశ, కామారెడ్డి: నోరు విప్పితే పెద్ద సంఘాలని చెప్పుకుంటారు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు. ఉద్యోగుల కేటాయింపుల్లో వివక్షత చూపుతుంటే ఆ సంఘం ఎక్కడ దాక్కుంది అంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగానే కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జాక్టో ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. 7 సంవత్సరాలుగా తాము మోసపోతూనే ఉన్నామని […]
దిశ, కామారెడ్డి: నోరు విప్పితే పెద్ద సంఘాలని చెప్పుకుంటారు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు. ఉద్యోగుల కేటాయింపుల్లో వివక్షత చూపుతుంటే ఆ సంఘం ఎక్కడ దాక్కుంది అంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగానే కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జాక్టో ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. 7 సంవత్సరాలుగా తాము మోసపోతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పెద్ద సంఘాల ఎమ్మెల్సీలు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. వాళ్ళు ఎక్కడ దాక్కున్న బయటకు రావాలని డిమాండ్ చేశారు.
స్థానికంగా స్థిరనివాసం ఏర్పర్చుకున్నాక బలవంతంగా మమ్మల్ని ఈ జిల్లాకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లకు ప్లేసులు ఇచ్చి మాకు రిమోట్ ఏరియాలను ఇచ్చారన్నారు. జూనియర్లకు ఒక న్యాయం, సీనియర్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పెద్ద సంఘం నాయకులు స్పష్టమైన గైడ్ లైన్స్‌తో రావాలన్నారు. స్థానికత ఆధారంగానే కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశారు.
‘మొనగాళ్ళ సంఘం ఎక్కడుంది. పొద్దున వెళ్లి సాయంత్రం జీఓ తెస్తామని చెప్పే సంఘం ఎక్కడ దాక్కుంది. ఏ సమస్య అయినా మాతోనే సాధ్యం అని చెప్పే సంఘం ఎక్కడ పడకేసింది. అంతర్ జిల్లాల బదిలీలు చేపిస్తాం.. భార్య భర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఉండేలా చేస్తాం అని చెప్పిన సంఘం కనిపించకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తొత్తులుగా చేరేందుకేనా మిమ్మల్ని ఎమ్మెల్సీలను చేసింది అని ప్రశ్నించారు. ప్రభుత్వం వాస్తవాలను గ్రహించాలని, లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వెంటనే స్థానికత ఆధారంగా కేటాయింపులు చేపట్టాలని, వీలైతే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.