రాజకీయాల కోసం రైతులను బలిచేస్తున్నారు : తమ్మినేని వీరభద్రం
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ తమ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తుర్కయంజాల్‌లో సీపీఎం రాష్ట్ర మహాసభల ఆహ్వానసంఘం ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధర్నాలు ఎందుకు చేపట్టారో చెప్పాలన్నారు. తీవ్ర ఆందోళన, అయోమయంలో ఉన్న రైతులకు ధాన్యం కొంటామని భరోసా ఇస్తున్నారా? వరిపంట వేయొద్దని రైతులకు సూచిస్తున్నారా? అని ప్రశ్నించారు. పోడు […]
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ తమ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తుర్కయంజాల్‌లో సీపీఎం రాష్ట్ర మహాసభల ఆహ్వానసంఘం ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధర్నాలు ఎందుకు చేపట్టారో చెప్పాలన్నారు. తీవ్ర ఆందోళన, అయోమయంలో ఉన్న రైతులకు ధాన్యం కొంటామని భరోసా ఇస్తున్నారా? వరిపంట వేయొద్దని రైతులకు సూచిస్తున్నారా? అని ప్రశ్నించారు.
పోడు భూములపై..
పోడు భూములకు పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమే, అయితే దీనిపై ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు అసలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. అడవిలో భూమి కాకుండా బయట ఇస్తామనడం, అడవుల్లో గ్రామాలను ఖాళీ చేయాలనడం, ఓటరు లిస్టులో పేరుంటేనే పట్టాలిస్తామనడం, ఇంటి పన్ను కడితేనే పట్టాలిస్తామనడం చట్ట విరుద్దమన్నారు. ఏదో ఒక వంకతో దరఖాస్తులు తక్కువ చేసి, ఐదో పదో పట్టాలిచ్చి చేతులు దులుపుకొని, పోడు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కరెంట్ చార్జీలు పెంచాలని కుట్ర
కరెంట్ బిల్లులు పెంచాలని ప్రభుత్వం చూస్తోందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. డిస్కంలు రూ.వేలకోట్ల నష్టాల్లో కూరుకుపోయాయన్న వంకతో ప్రజలపై భారాన్ని మోపాలని చూస్తున్నారన్నారు. డిస్కంల నష్టాలకు ప్రభుత్వాలే కారణం కాబట్టి ఈ భారాన్ని ప్రజలపై మోపుతామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. దీనిపై ప్రభుత్వం అఖిలపక్షాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు.