నా బిడ్డలు మిస్సింగ్.. మట్టి మనుషులపై మంత్రి పగ ..
దిశ, సినిమా : దేశంలోని ప్రధాన నగరాల్లో గల సగం జనాభా.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ పల్లెల నుంచి వలసొచ్చినవారే. నిజానికి కన్నతల్లి వంటి సొంతూరును విడిచి వెళ్లేందుకు ఎవరికీ మనసొప్పదు. కానీ ఆర్థిక పరిస్థితులు, ప్రొఫెషన్, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు వంటి అంశాలు నగర జీవితాన్ని పరిచయం చేస్తాయి. కాలక్రమేణా జన్మనిచ్చిన నేల ఓ జ్ఞాపకంగానే మిగిలిపోగా.. ఆశ్రయమిచ్చిన సిటీపై పెంచుకున్న ప్రేమ మళ్లీ ఊరి ముఖం చూడనివ్వదు. ఇది నాణేనికి ఒకవైపు […]
దిశ, సినిమా : దేశంలోని ప్రధాన నగరాల్లో గల సగం జనాభా.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ పల్లెల నుంచి వలసొచ్చినవారే. నిజానికి కన్నతల్లి వంటి సొంతూరును విడిచి వెళ్లేందుకు ఎవరికీ మనసొప్పదు. కానీ ఆర్థిక పరిస్థితులు, ప్రొఫెషన్, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు వంటి అంశాలు నగర జీవితాన్ని పరిచయం చేస్తాయి. కాలక్రమేణా జన్మనిచ్చిన నేల ఓ జ్ఞాపకంగానే మిగిలిపోగా.. ఆశ్రయమిచ్చిన సిటీపై పెంచుకున్న ప్రేమ మళ్లీ ఊరి ముఖం చూడనివ్వదు. ఇది నాణేనికి ఒకవైపు కాగా.. కష్టమో, నష్టమో! పురిటి గడ్డపైనే పంచ ప్రాణాలు నిలుపుకుని, అభివృద్ధి లేకున్నా పల్లెను వదలని మట్టి మనుషులు మరోవైపు. అయితే, సాటి మనిషిని ప్రేమగా పలకరించడమే తెలియని సిటీ జనాలకు.. మూగజీవాలను సైతం ప్రేమగా చూసుకునే పల్లెవాసులకు మధ్య తేడా మాత్రం సుస్పష్టం. కనీస సదుపాయాలు లేని అలాంటి ఓ పల్లెలో నివసిస్తున్న యువ దంపతులు సొంత బిడ్డలుగా సాదుకుంటున్న ఎడ్లు రాత్రికి రాత్రే మాయమైతే.. పోలీసులు ఏం చేశారు? రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రికి, వీటి మిస్సింగ్‌కు ఏంటి సంబంధం? చూపిన తమిళ చిత్రం ‘రామే ఆండాలుమ్, రావణే ఆండాలుమ్’.
స్టోరీ ఎనాలిసిస్..
తమిళనాడులోని పూచేరి గ్రామానికి చెందిన కున్నిముత్తు, వీరాయి దంపతులకు తమ పెళ్లిలో ‘వేలయన్, కురుప్పన్’ అనే రెండు లేగదూడలు బహుమతిగా అందుతాయి. వీటిపై అమితమైన ప్రేమను పెంచుకున్న ఆ యంగ్ కపుల్.. నాలుగేళ్ల నుంచి వాటినే సొంత బిడ్డల్లా సాదుతుంటారు. అవి కూడా తమ యజమానుల మీద అంతే ఎఫెక్షన్ చూపిస్తుంటాయి. ఎప్పుడైనా పనిమీద ఊరెళితే.. వాళ్లు వచ్చేవరకు చుక్కనీటిని కూడా ముట్టుకోవు. ఇక తన ఎడ్లకు చిన్న గాయమైనా తట్టుకోలేని స్వభావం కున్నిముత్తుది. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి ఒకరోజు వేలయన్, కురుప్పన్ కనిపించకుండా పోతాయి. ఎంత వెతికినా జాడ తెలియకపోవడంతో సమీప పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చేందుకు వెళ్తాడు కున్నిముత్తు. కానీ మంత్రి భార్య కుక్కపిల్ల తప్పిపోతే, దాన్ని పట్టుకునేందుకు ప్రాధాన్యతనిచ్చిన పోలీసులు.. కున్నిముత్తు కంప్లయింట్ తీసుకోకుండా తిట్టి పంపిస్తారు. నిస్సహాయంగా వెనుదిరిగిన తను.. ఫ్రెండ్ సాయంతో చుట్టుపక్కల గ్రామాల్లో వెతుకుతుంటాడు. ఇదే టైమ్‌లో ఓ టీవీ రిపోర్టర్.. డాక్యుమెంటరీ షూటింగ్ కోసం పూచేరి గ్రామానికి వస్తుంది. రిపోర్టింగ్‌లో ఆరేళ్ల నుంచి ఆ గ్రామం కరువుతో అల్లాడుతోందని.. ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవనే విషయం అర్థమవుతుంది. ఈ ఇష్యూస్‌పై ఫోకస్ చేస్తున్న క్రమంలో కున్నిముత్తును చూసిన రిపోర్టర్.. ఒకసారి పశుసంవర్థక శాఖ మంత్రిని మీటింగ్‌లో తోసేసింది తానే అని గుర్తుపడుతుంది. తన ఎడ్లు కనిపించకుండా పోయిన సంగతి తెలుసుకుని, అది మంత్రిగారి పనే అని వివరిస్తుంది. ఇంతకీ ‘వేలయన్, కురుప్పన్’ను మంత్రి ఎందుకు అపహరించాడు? కున్నిముత్తు.. మీటింగ్‌లో మంత్రిని ఎందుకు తోసేశాడు? చివరకు ఎడ్లు దొరికాయా? ఇందులో మీడియా పాత్ర ఏంటి? ప్రతిపక్షాలు ఈ ఇష్యూను తమకు అనుకూలంగా ఏ విధంగా వాడుకున్నాయి? అనేది మిగతా స్టోరీ.
నాయకుల అవినీతిపై వ్యంగ్యాస్త్రం..
ప్రపంచంలో ఇండియా సూపర్ పవర్‌గా ఎదుగుతోందని చంకలు గుద్దుకుంటున్నామే తప్ప.. అవినీతి నాయకుల వల్ల ఇప్పటికీ రూరల్ ఏరియాల్లోని పలు గ్రామాలు రోడ్డు, విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస సదుపాయాలు లేక తల్లడిల్లుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే ‘అద్దెకు తీసుకొచ్చిన గొర్లు, బర్లను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు మీడియాలో పోజులిచ్చే మంత్రి.. అతని మెప్పు కోసం సామాన్యులను ఇబ్బందులు పెట్టే కార్యకర్తలు.. టీఆర్‌పీ రేటింగ్స్ కోసం తండ్లాటే తప్ప జనం సమస్యను పట్టించుకోని మీడియా.. అమాయక జనాలను మోసం చేస్తూ అభివృద్ధి చేయకుండానే నిధులు కాజేస్తున్న అధికారులు, లీడర్లు.. రెక్కలొచ్చి పట్టణాలకు వలసపోయి సొంతూరును పట్టించుకోని విద్యావంతులు..’ ఇన్ని సమస్యలను చర్చిస్తూనే ఎద్దులే లోకంగా బతుకుతున్న ఓ యువ జంట.. అవి తప్పిపోతే అనుభవించే బాధను, తిరిగొచ్చాక పొందే ఎమోషన్‌ను కళ్లకు కట్టిన ‘రామే ఆండాలుమ్, రావణే ఆండాలుమ్’ చిత్రం నిజంగానే ప్రతీఒక్కరి గుండెను స్పృశించింది.
– సంతోష్ దామెర