చిక్కుల్లో పడిన ప్రముఖ కాంగ్రెస్ నేత!

దిశ, ఆదిలాబాద్: ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన నేత. ఆర్థికంగానూ ఎంతో బలంగా ఉన్నాడన్న పేరుంది. గతంలో శాసనసభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అలాంటి నాయకుడి కొడుకు పేరిట ఉన్న భూమి ఓ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భూసేకరణకు గురైంది. అందుకు సంబంధించిన పరిహారాన్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆ భూమిని ఒక సోలార్ కంపెనీకి అమ్మారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనులు ముందుకు సాగకుండా నిలిచిపోయింది. నిర్మల్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ […]

Update: 2020-06-12 03:38 GMT

దిశ, ఆదిలాబాద్: ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన నేత. ఆర్థికంగానూ ఎంతో బలంగా ఉన్నాడన్న పేరుంది. గతంలో శాసనసభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అలాంటి నాయకుడి కొడుకు పేరిట ఉన్న భూమి ఓ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భూసేకరణకు గురైంది. అందుకు సంబంధించిన పరిహారాన్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆ భూమిని ఒక సోలార్ కంపెనీకి అమ్మారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనులు ముందుకు సాగకుండా నిలిచిపోయింది. నిర్మల్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ 27, 28 ప్యాకేజీల కింద ఎత్తిపోతల పథకాలకు అధికారులు భూ సేకరణ చేశారు. ఆ మేరకు పనులు కూడా జరుగుతున్నాయి. భూసేకరణలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలో ఉన్న వెంకటాపూర్ గ్రామ శివారులో రైతుల నుంచి భూములను ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి పరిహారం కూడా ఇచ్చింది. 2016 సంవత్సరంలో జరిగిన భూ సేకరణలో భాగంగా వెంకటాపూర్ గ్రామ శివారులో జిల్లా కాంగ్రెస్ నేత తనయుడి పేరిట ఉన్న భూమిని కూడా ప్రభుత్వం సేకరించింది. ఇందుకు సంబంధించి 3.02 ఎకరాల భూమికి ప్రభుత్వం సుమారు రూ.8.5 లక్షల పరిహారం చెల్లించింది. అలాగే వీరికి సన్నిహితుడైన మరో వ్యక్తి నుంచి కూడా 38 గుంటల భూమి సేకరించి పరిహారం కూడా ఇచ్చింది. ఆ తర్వాత పనులు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ భూమిని కాంగ్రెస్ నేత తనయుడు ఓ సోలార్ కంపెనీకి అమ్మడం వివాదానికి దారి తీస్తోంది.

వెలుగు చూసింది ఇలా…

కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనులు చేస్తున్న గుత్తేదారులు వెంకటాపూర్ సమీపంలో పనులు చేపట్టేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ భారీ ఎత్తున ఒక సోలార్ ప్రాజెక్టు వెలిసింది. ఆ భూమిలో నుంచి కాలువ తవ్వాల్సి ఉందని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు చెప్పగా.. తాము కొనుగోలు చేసినట్లు సోలార్ కంపెనీ యజమానులు చెప్పారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులకు చూపారు. అయితే 2016లోనే భూసేకరణ కింద ప్రభుత్వం సేకరించిందని, పరిహారం కూడా ఇచ్చిందన్నారు. ఆ విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సోలార్ కంపెనీ యజమానులు చెప్పారు. దీనిపై సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులతో సంప్రదించారు. భూ సేకరణ కింద పరిహారం ఇచ్చి భూమి తీసుకున్నామని అధికారులు తేల్చారు. బైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపారు. ఇక్కడ కాంగ్రెస్ నేత తనయుడు, మరో వ్యక్తి కలిసి పరిహారం పొందిన భూమిని సోలార్ కంపెనీ అమ్మిన వాస్తవం వెలుగులోకి వచ్చింది. దీంతో వివాదం చిక్కుల్లో పడగా… కాలువల నిర్మాణం పనులు పెండింగులో పడ్డాయి.

డబుల్ రిజిస్ట్రేషన్.. చిక్కుల్లో కాంగ్రెస్ నేత!

వెంకటాపూర్ గ్రామ సమీపంలో భూములు అమ్మిన వ్యవహారంలో ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయన తనయుడు, మరో వ్యక్తి కలిసి నాలుగు ఎకరాల భూమిని కాలువకు, సోలార్ కంపెనీకి ఇచ్చారు. ఒకే భూమిని ఇద్దరి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబమే అయినప్పటికీ.. ఇలా రెండు సార్లు భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆ కుటుంబం కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కావడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ఈ వివాదం సదరు కాంగ్రెస్ నేతను చిక్కుల్లో పడేస్తోంది.

పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు..!

వెంకటాపూర్ గ్రామ శివారులో భూ సేకరణ చేసి పరిహారం పొందిన భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన వ్యవహారంపై ముథోల్ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూసేకరణలో కాళేశ్వరం ప్రాజెక్టు 27, 28 ప్యాకేజీలకు చెందిన భూమి ఆక్రమణకు గురైందని ఈ పనులను నిర్వహిస్తున్న కడెం ప్రాజెక్టు ఈఈ ముథోల్ తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రికార్డులు తనిఖీ చేసిన తహసీల్దార్ కాంగ్రెస్ నేత తనయుడితో పాటు మరొక వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానే. ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత మెడకు చుట్టుకునేలా ఉంది.

Tags:    

Similar News