‘ధరణి’ ఇక్కట్లకు మోక్షమెప్పుడో?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఏది చేసినా అద్భుతమే. ఏ పథకాన్ని రూపొందించినా అత్యద్భుతమే.. ఏ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినా ప్రపంచమే ఇటువైపు చూస్తోంది.. ఇదే పాలకులతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల మాటలు. ప్రతి పనినీ ఆర్భాటంగానే ప్రకటిస్తారు. ఆ తర్వాత తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా ఇబ్బందులకు గురి చేస్తారు. సరిగ్గా ధరణి పోర్టల్ కూడా అదే తరహాలో కనిపిస్తోంది. పైగా 99 శాతం బాగుందంటూ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ప్రకటించారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఏది చేసినా అద్భుతమే. ఏ పథకాన్ని రూపొందించినా అత్యద్భుతమే.. ఏ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినా ప్రపంచమే ఇటువైపు చూస్తోంది.. ఇదే పాలకులతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల మాటలు. ప్రతి పనినీ ఆర్భాటంగానే ప్రకటిస్తారు. ఆ తర్వాత తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా ఇబ్బందులకు గురి చేస్తారు. సరిగ్గా ధరణి పోర్టల్ కూడా అదే తరహాలో కనిపిస్తోంది. పైగా 99 శాతం బాగుందంటూ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ప్రకటించారు. కానీ లక్షలాది మంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.100 మంది కలిగిన వార్ రూం కూడా వారి దరఖాస్తులను పరిష్కరించడం లేదు. నిష్ణాతులైన ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా మార్గదర్శకాలను రూపొందించలేకపోతున్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన చీఫ్ సెక్రెటరీ కూడా ఇదిగో, అదిగో అంటూ నెలల తరబడి కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనం గోడు వినిపించడం లేదు.
దీంతో తమపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందంటూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది. ఉన్నతాధికారులకు ధరణి పోర్టల్ సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టింది. వారంలో మొత్తం సమస్యలు పరిష్కారమవుతాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ వాటిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరణి పోర్టల్, రెండు కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి నెలలు గడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ మార్గదర్శకాలను విడుదల చేయలేదు. ఏ సమస్య తలెత్తితే ఏం చేయాలన్న అంశంలో తహసీల్దార్లకు క్లారిటీ లేకుండా పోయింది. కనీసం ఆర్డీఓ, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లకు మొర పెట్టుకుందామనుకున్నా ఆ అవకాశమే లేదు. వారికి ఏ అధికారమూ లేకుండా పోయింది. కనీసం ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కారం కనుక్కునేందుకు ఏ వ్యవస్థ లేకుండా రూపొందించిన ధరణితో తహసీల్దార్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇకనైనా ధరణి అమలులో ఎదురవుతున్న సమస్యలు అధిగమించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వ్యవసాయేతరంతో మరిచిన వ్యవసాయం
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమస్యలపై పట్టణ ప్రాంత జనం గగ్గోలు పెడుతున్నారు. నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ హక్కుదారుల్లో విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో సమస్యల గళం వినిపిస్తున్నారు. కానీ ధరణి ద్వారా సాగు భూముల సమస్యలను పక్కదారి పట్టించారు. వాటికింకా పూర్తి స్థాయిలో పరిష్కారమే చూపలేదని భూచట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొ.సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయం చేసుకునే రైతుకు తన హక్కుల్లోని పొరపాట్లు ఏం జరిగాయో కూడా ఇంకా చూసుకోలేదన్నారు. తాము పారాలీగల్ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేయిస్తే ఎన్నో వివాదాలు చుట్టుముట్టినట్లు చెప్పారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. మెరుగైన వ్యవస్థ రూపకల్పనకు సమస్యలను సత్వరం పరిష్కరించే విధానపరమైన నిర్ణయాలు రావాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు చిరస్థాయి స్థానం ఉందిదదద. కానీ రెవెన్యూ వ్యవస్థకు సమస్యలు లేని సాఫ్ట్‌వేర్‌ను రూపొందించలేకపోయారని నిపుణులు విమర్శిస్తున్నారు. క్షేత్ర స్థాయి ఇబ్బందులను గుర్తించడం లేదు. కనీసం ఉద్యోగ సంఘాలు చెప్పినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకెన్నాళ్లకు ధరణి పోర్టల్‌లో సాగు భూముల సమస్యలు పరిష్కరిస్తారో అంతుచిక్కడం లేదు. పైగా సూపర్ ర్… అంటూ సీఎం కేసీఆర్‌కు నివేదికలు సమర్పిస్తున్నారని రిటైర్డ్ రెవెన్యూ అధికారులు మండిపడుతున్నారు.
సమస్యలన్నీ అపరిష్కృతమే
– ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్‌లో ఏదైనా భూ వివాదంలో కోర్టులు జారీ చేసిన స్టే ఆర్డర్, స్టేటస్ కో వంటి ఉత్తర్వులను కలెక్టర్ల పరిశీలనకు పంపే వ్యవస్థ లేదు. ఆ వివాదాస్పద రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం కలెక్టర్లకు కల్పించాలని తహసీల్దార్లు కోరుతున్నారు.
– నిషేధిత భూముల జాబితా 22ఎ లో నమోదు చేసిన ప్రభుత్వ భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో పూర్తి స్థాయిలో కనిపించడం లేదు.
– కొన్ని ప్రాంతాల్లో అసైన్డ్ భూములు పట్టా భూములుగా, పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. అలాంటి రిజిస్ట్రేషన్లను ఆపేందుకు అవకాశం లేదు. వీటిపై కలెక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
– నెలలు గడుస్తున్నా ఆర్ఎస్ఆర్ విస్తీర్ణంలో వ్యత్యాసానికి పరిష్కారాన్ని చూపలేదు.
గ్రేట్ సాఫ్ట్‌వేర్ మరి..
– ఏదైనా ప్రాపర్టీని ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఏదైనా ఆస్తిని ఒక్కరే కొనుగోలు చేయాలి. రిజిస్ట్రేషన్ విధానంలో ఆ ఆప్షన్ లేదు.
– పెండింగ్ మ్యుటేషన్‌కు సంబంధించి ధరణి పోర్టల్‌లో రుసుం జనరేట్ అయినప్పటికీ స్లాట్ బుక్ కావడం లేదు. దాంతో మ్యుటేషన్ల ప్రక్రియ నిలిచిపోతుంది.
– అసైన్డ్ భూములను విరాసత్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
– భాగ పంపిణీ భూములకు సంబంధించిన పార్టిషనల్ భూమికి బదులుగా మొత్తం భూమికి ఫీజు జనరేట్ అవుతుంది.
– ధరణిలో నమోదైన డేటాలో క్లరికల్ మిస్టేక్స్‌ను సరిదిద్దేందుకు అవకాశమే లేదు.
పెండింగ్ డీఎస్ .. అంతేనా?
భూములు కొనుగోలు చేసేందుకు అన్ని రకాల పన్నులు కట్టారు. ప్రతి దస్త్రం సరిగ్గా ఉందని సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేశారు. కానీ ధరణి అమల్లోకి రాకముందు కొందరు అధికారులు, ఉద్యోగులు ఉద్ధేశపూర్వకంగా మ్యుటేషన్లను నిలిపివేశారు. మ్యుటేషన్ ఆర్డర్లు జారీ చేసినా డిజిటల్ సంతకాలు పెండింగులో పెట్టి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయకుండా నిలిపివేశారు. భూ యజమానులెవరూ అక్రమార్కులు కాదు. కానీ కేవలం ధరణి పోర్టల్ కారణంగానే నిలిపివేశారు. నెలల తరబడి వారిని ప్రభుత్వ విధానాల కారణంగా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో మ్యుటేషన్ చేయలేదు. తిరిగి వాటిని మరొకరికి ఆ యజమానికి అమ్ముకునేందుకు అవకాశం ఉంది. దీంతో రెండోసారి కూడా యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకునేటట్లుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దాంతో ఇప్పటికే కొనుగోలు చేసిన వారిలో భయం పట్టుకుంది. ఎంత కాలమని తమ ఫైళ్లు పెండింగు పెడతారంటూ తహసీల్దార్లను నిలదీస్తున్నారు. వీళ్లకేమో అధికారాలు ఉన్నా ఆప్షన్లు ఇవ్వకుండా ఎడతెగని జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.
ఏజీపీఏకు హక్కుల్లేవు
ధరణి పోర్టల్ ప్రపంచంలోనే అద్భుతమైనది. కానీ పాత వ్యవస్థలోని విధానాలను అమలు చేయలేకపోతోంది. ఏజీపీఏలను రద్దు చేశారు. కానీ గతంలో ఏజీపీఏ చేసుకున్న వారికి హక్కులు కల్పించడం లేదు. వారూ పూర్తి స్థాయిలో స్టాంపు డ్యూటీ చెల్లించిన వారే. కానీ వారి పేర్లను ధరణిలో నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు. విధి విధానాలనే ఖరారు చేయలేదు. దాంతో వాళ్లు మరొకరికి అమ్ముకోలేకపోతున్నారు.
పెరుగుతున్న సివిల్ తగాదాలు
ధరణి పోర్టల్‌లో విరాసత్ కేసుల్లో కుటుంబ సభ్యుల జాయింట్ స్టేట్‌మెంట్‌లో కొంత మంది వివాహం చేసుకున్న మహిళలు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఇవ్వకుండా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో సివిల్ తగాదాలు పెరిగే అవకాశం ఉంది. పైగా స్టేట్‌మెంట్ ఎంత వరకు నిజమన్న విషయాన్ని గుర్తించే వ్యవస్థ లేదు. విచారణ చేయడానికి మానవ వనరులు లేవు. ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో అనేక వివాదాలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నట్లు తహసీల్దార్లు చెబుతున్నారు.
కేసుల పరిష్కారమేది?
తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 అమల్లోకి వచ్చిన తర్వాత ఇనాం, సీలింగ్ టెనెన్సీ, పీఓటీ, అసైన్మెంట్, వక్ఫ్, భూదాన్ వంటి కేసులను పరిష్కరించేందుకు ఏ వ్యవస్థ లేకుండా పోయింది. పార్టు బి కేసుల పరిష్కారానికి సరైన మార్గదర్శకాలు లేవు. దాంతో గ్రామాల్లో రెవెన్యూ అధికారులపై తీవ్ర స్థాయిలో ప్రజల నుంచి ఒత్తిడి వస్తోంది. వేలాది మంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారికేం సమాధానం చెప్పాలో వారికి అర్థం కావడం లేదు. ప్రభుత్వమేమో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
సెలవు పెడితే అంతే..
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లను, ఆటోమేటిక్ మ్యుటేషన్ చేసే బాధ్యత తహసీల్దార్లదే. ఆయన సెలవు పెట్టినప్పుడు అన్ని పనులు బంద్ చేయాల్సిందే. ఆయన లేకుంటే లాగిన్ మార్చే అధికారం ఎవరికీ లేదు.