Canada: కెనడా ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా

గత కొంతకాలంగా జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేయడంతో ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Update: 2025-01-06 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన లిబరల్ పార్టీలో పెరుగుతున్న అసమ్మతి కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త నాయకత్వాన్ని ఎంచుకునే వరకు తాత్కాలిక నేతగా వ్యవహరిస్తానని చెప్పారు. గత కొంతకాలంగా జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేయడంతో ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పార్టీ నాయకత్వానికి, ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసే విషయాన్ని పార్టీకి, గవర్నర్‌కు సమాచారం ఇచ్చాను. ఈ ప్రక్రియను ప్రారంభించాలని గత రాత్రే లిబరల్ పార్టీ అధ్యక్షుడిని కోరినట్టు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో అక్టోబర్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. అయితే, కెనడా చట్టాల ప్రకారం, అధికార పార్టీ రాజీనామా చేస్తే గనక, 90 రోజుల్లోగా కొత్త లీడర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అనేక సందర్భాల్లో అవిశ్వాస తీర్మానాన్ని అధిగమించలేకపోయింది. ట్రూడో ప్రభుత్వానికి ప్రజాదరణ కూడా క్షీణిస్తూనే ఉంది. అమెరికా అడ్మినిస్ట్రేషన్‌తో బెడిసికొట్టిన సంబంధాలతో పాటు దేశీయ, అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడంలో విఫలం కావడమే ట్రూడో నిష్క్రమణకు కారణమని నిపుణులు భావిస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్లు..

రాబోయే ఎన్నికలలో లిబరల్స్‌కు నాయకత్వం వహిస్తామని ట్రూడో హామీ ఇచ్చారు. అయితే, కెనడియన్ వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం సహా ఇతర అంశాలపై పెరుగుతున్న ఒత్తిడిని ట్రూడో ఎదుర్కొంటున్నాడు. దీనికి తోడు ట్రంప్ విధానాలపై చర్చించే క్రమంలో ట్రూడోతో విభేదాల కారణంగా కెనడా ఉప ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ ఇటీవల రాజీనామా చేయడం మరింత ఒత్తిడి కలిగించే అంశం. దీంతో ఆయన మంత్రివర్గంలో తొలిసారిగా అసమ్మతి బహిరంగంగా వ్యక్తమైంది. ఫ్రీలాండ్ నిష్క్రమణ తరువాత, ట్రూడో తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. తన ప్రభుత్వాన్ని కొనసాగించే ప్రయత్నంలో మంత్రులలో మూడవ వంతును భర్తీ చేశారు. నవంబర్‌లో వాణిజ్య యుద్ధాన్ని నివారించే ప్రయత్నంలో ట్రూడో ఫ్లోరిడాలోని ట్రంప్‌నకు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌ను సందర్శించారు. అయినప్పటికీ, ట్రంప్ ట్రూడోను బహిరంగంగా విమర్శిస్తూనే ఉన్నారు.

ట్రూడో రాజకీయ ప్రయాణం..

మాజీ కెనడా ప్రధాన మంత్రి పియరీ ట్రూడో పెద్ద కుమారుడే జస్టిన్ ట్రూడో. ఈయన కెనడా ప్రధనిగా 2015లో అధికారంలోకి వచ్చారు. 2019, 2021లోనూ లిబరల్స్‌ను రెండుసార్లు ఎన్నికల్లో విజయం అందించారు. అయితే, ఇటీవలి పోల్స్‌లో ట్రూడో తన ప్రధాన ప్రత్యర్థి, కన్జర్వేటివ్ నేత పియరీ పోయిలీవ్రే కంటే 20 పాయింట్లు వెనుకబడి ఉన్నట్టు సంకేతాలిచ్చాయి. రాజకీయాల్లోకి రాకముందు, ట్రూడో స్నోబోర్డ్ ట్రెయినర్‌గా, బార్టెండర్, ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. 2008లో తొలిసారి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.

ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ట్రూడో సెనేట్ సంస్కరణలను ప్రవేశపెట్టారు. అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గ్రీన్‌హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అరికట్టడానికి కార్బన్ పన్నును అమలు చేశారు. అలాగే, గంజాయిని చట్టబద్ధం చేశారు. తప్పిపోయిన, హత్య చేయబడిన కెనడా స్త్రీలకు సంబంధించి బహిరంగ విచారణ నిర్వహించారు. వైద్య సహాయంతో ఆత్మహత్యకు చేసుకునేందుకు అనుమతించే చట్టాన్ని ఆమోదించారు.

అనేక సందర్భాల్లో ట్రూడో విజయవంతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, గత కొన్నేళ్లలో ట్రూడో నాయకత్వంపై విమర్శలు పెరిగాయి. దీంతో రాబోయే ఎన్నికలలో పార్టీని నడిపించేందుకు కొత్త నాయకుడిని ఎన్నుకునే సవాలును లిబరల్ పార్టీ ఎదుర్కోనుంది. 

Tags:    

Similar News