RBI: నవంబర్‌లో 8 టన్నుల బంగారం కొనుగోలు చేసిన ఆర్‌బీఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) 8 టన్నుల బంగారం కొనుగోలు చేసిందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే 2024, నవంబర్‌లో వివిధ సెంట్రల్ బ్యాంకులు మొత్తం 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇందులో 8 టన్నులను భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బంగారం కొనుగోలు చేసిందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) సోమవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. దీంతో అత్యధికంగా బంగారం కొన్న సెంట్రల్ బ్యాంకుల జాబితాలో ఆర్‌బీఐ మూడోస్థానంలో నిలిచింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం, యుద్ధాల కారణంగా సెంట్రల్ బ్యాంకులు సురక్షితమైన, స్థిరమైన ఆస్తిగా బంగారం కొనేందుకు ఆసక్తి చూపించాయి. ఇదే సమయంలో మొత్తం 2024 ఏడాదిలోనే అంతర్జాతీయ సవాళ్ల రిస్క్‌ను తగ్గించుకునేందుకు అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకుల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు ముందువరుసలో ఉండటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పెరిగేందుకు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కీలకంగా మారాయని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. గతేడాది నవంబర్‌లో ఆర్‌బీఐ 8 టన్నులతో కలిపి 2024లో మొత్తం 73 టన్నులు కొనుగోలు చేయడం ద్వారా మొత్తం నిల్వలను 876 టన్నులకు పెంచుకుంది. అత్యధికంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలండ్ నవంబర్‌లో కొన్న 21 టన్నులతో కలిపి 2024లో 90 టన్నులు కొనుగోలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ గతేడాది 11 టన్నులను కొనుగోలు చేసింది. మనదేశం తర్వాత కజక్‌స్తాన్ 5 టన్నులు, చైనా 5 టన్నులు, జోర్డాన్ 4 టన్నులు, తుర్కియే 3 టన్నులను కొనుగోలు చేశాయి.