AP News :భావితరం పయనమెటు.. ఆంగ్ల మాధ్యమమే సోపానం కాదు..!
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ఆంగ్ల మాధ్యమమే విప్లవాత్మక చర్యగా భావిస్తోంది. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తోంది. పిల్లలను బడికి పంపేందుకు కన్నవాళ్లకు అమ్మ ఒడితో నగదు సాయం చేస్తోంది. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం పెడుతోంది. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీలు, ఎలిమెంటరీ, అప్పర్‌ప్రైమరీ, ఉన్నత పాఠశాలల దొంతరలను మార్చేస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థల మాదిరిగా నర్సరీ నుంచి రెండో తరగతి దాకా ఫౌండేషన్స్కూళ్లుంటాయి. 3,4,5 […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ఆంగ్ల మాధ్యమమే విప్లవాత్మక చర్యగా భావిస్తోంది. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తోంది. పిల్లలను బడికి పంపేందుకు కన్నవాళ్లకు అమ్మ ఒడితో నగదు సాయం చేస్తోంది. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం పెడుతోంది. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీలు, ఎలిమెంటరీ, అప్పర్‌ప్రైమరీ, ఉన్నత పాఠశాలల దొంతరలను మార్చేస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థల మాదిరిగా నర్సరీ నుంచి రెండో తరగతి దాకా ఫౌండేషన్స్కూళ్లుంటాయి. 3,4,5 తరగతులను ప్రిలిమనరీ స్కూళ్లు, 6,7,8 తరగతులను మిడిల్స్కూళ్లు, 9 నుంచి 12 దాకా సెకండరీ స్కూళ్లుగా మార్పు చేస్తోంది. దీనికి సంబంధించి ఏ స్కూలును దేంట్లో విలీనం చేయాలనే దానిపై కసరత్తు పూర్తి చేసి బుధవారం పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు నివేదిక పంపనున్నారు. దీన్నిబట్టి ప్లస్‌టూ దాకా పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం గమనించాల్సిన ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే..
“నువ్వు ఏదైనా భాషలో చెబితే అవతలి వ్యక్తి మెదడుకి మాత్రమే చేరుతుంది. అదే అతని మాతృభాషలో చెబితే గుండెకు చేరుతుంది” అని నెల్సన్మండేలా అంటారు. ప్రభుత్వం నర్సరీ నుంచి ప్లస్‌టూ దాకా ఆంగ్ల మాధ్యమమే విద్యార్థులను పోటీ ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడుతుందని చెబుతోంది. ఇది ఆచరణలో ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేద, దిగువ మధ్యతరగతి వాళ్ల పిల్లలే. మన సమాజంలో విజ్ఞానాన్ని గ్రహించే విధానం నాలుగు దశల్లో ఉంటుంది. సహజంగా బాల్యంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి నుంచి జ్ఞానాన్ని పొందుతారు. కౌమరదశలో పాఠశాల, పుస్తకాలు, స్నేహితుల నుంచి గ్రహిస్తారు. యవ్వనంలో అప్పటిదాకా గ్రహించిన సారానికి అనుభవాలను జోడించి విజ్ఞాన సముపార్జనకు బాటలు వేసుకుంటారు. ఇక్కడ విజ్ఞాన సముపార్జనలో భాష కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకించి ప్లస్‌టూ దాకా మాతృభాషలో గ్రహించే విజ్ఞానాన్ని పరాయిభాషలో గ్రహించాలంటే అంతకు మూడు రెట్ల సమయం తీసుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీన్ని ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. కేవలం తల్లిదండ్రుల ఆశలకు అద్దం పట్టేందుకే ప్రాధాన్యమిస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో చదవడం పరువు ప్రతిష్టల సమస్యగా మార్చిన కార్పొరేట్ప్రభావం కన్నవాళ్లపై ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా పాలించిన ప్రభుత్వాలు కార్పొరేట్విద్యా మాఫియాలు ఆడమన్నట్లు ఆడిన ఫలితమే ఇది. దీన్నుంచి ప్రభుత్వం బయటకు వచ్చి ఆలోచన చేయాలి. కనీసం 8వ తరగతి వరకైనా మాతృభాషలో విద్యా బోధన తప్పనిసరి చేయాలి.
ప్రధానమైన అంశం పాఠ్యాంశాలు. చరిత్ర తెలుసుకోనివాళ్లు వర్తమానాన్ని గుర్తించలేరు. భవిష్యత్తును అంచనా వేయలేరు. అందువల్ల భూమిపై జీవి పుట్టుక నుంచి నేటి మానవరూపందాకా చోటుచేసుకున్న పరిణామాలు తెలుసుకునేట్లు చరిత్ర పాఠ్యాంశాలు ఉండాలి. ప్రపంచ నాగరికతలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించాలి. భారత రాజ్యాంగం పట్ల మౌలికమైన అవగాహన తీసుకొచ్చేట్లు ఓ పాఠ్యాంశాన్ని చేర్చాలి. పరిపాలనపై భావితరానికి అవగాహన పెంచాలి. ప్రజల ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై లోతుగా విశ్లేషించే సామర్థ్యం ఏర్పడాలి. ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే రూపాయి తిరిగి ప్రజలకు ఎలా చేరుతుందనే ప్రాథమిక అర్థశాస్ర్తాన్ని బోధించాలి. చట్టసభల్లో ఈ రూపాయి పంపిణీపై తీసుకునే నిర్ణయాలను లేశమాత్రమైనా గ్రహించేట్లుండాలి. ఆడంస్మిత్ఎకనమిక్స్స్థానంలో ఈ రాజకీయ అర్థశాస్ర్తాన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చాలి. ఇంకా సామాన్యశాస్ర్తానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ప్రకృతి సైన్స్‌గురించి అనుభవపూర్వక విజ్ఞానాన్ని గ్రహించేట్లు చేయాలి. పరిసరాల విజ్ఞానమే మనిషిని సమున్నతంగా తీర్చిదిద్దుతుంది. శాస్ర్తీయ భావజాలానికి పెద్ద పీట వేయాలి. పరిశోధనా రంగంవైపు ఆసక్తిని పెంచాలి. కనీసం ప్లస్‌టూ పూర్తి చేసుకొని ఓ విద్యార్థి స్కూలు నుంచి బయటకు వచ్చే నాటికి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలి. ఆ రంగాల్లోనే వెంటనే ఉపాధి లభించేట్లు కర్రిక్యులం ఉండాలి. అది గ్రామీణ సర్వముఖాభివృద్ధికి దోహదపడుతుంది. మొత్తంగా ప్రకృతి నుంచి నూతన ఆవిష్కరణలకు బాటలు వేసేదిగా సైన్స్సబ్జెక్టులను పొందుపరచాలి.
బోధనాంశాల్లో ఇవి లేకుంటే పీజీ చేసినోళ్లు కూడా తహసీల్దారు కార్యాలయం వద్ద పదో తరగతి చదువుకున్న వాళ్లతో దరఖాస్తు రాయించుకోవాల్సి వస్తుంది. మనం నిత్యం వినియోగించే పాలు ఎక్కడ నుంచి వస్తాయంటే ప్యాకెట్ల నుంచి వస్తాయనే అమాయకత్వానికి దిగజారుస్తుంది. మురుగు కాలువలో కప్పలు మాయమై దోమలు ఎందుకు పెరిగాయో తెలియకుంటే అది విజ్ఞానమే కాదు. వేప పుల్లతో పళ్లు తోముకోవడం అనాగరికమనే సూడో సైన్స్‌లోనే భావితరం మగ్గిపోతుంది. జీవ సమతుల్యత అంటే ఏమిటి.. పర్యావరణానికి ఎదురవుతున్న పెనుముప్పు గురించి కనీస అవగాహన లేకుంటే భావి పౌరులను మధ్య యుగాల నాటికి తీసుకెళ్లడమే అవుతుంది. మరో పదేళ్లలో నేటి పిల్లలే యువశక్తిగా ఎదుగుతారు. ఆ శక్తి ఎలా ఉండాలి.. ఎటువైపు పయనించాలనే లక్ష్యం లేకుంటే ఏ మాధ్యమంలో బోధించినా డాలర్లు లేదా రూపాయి ఆర్జించే రోబోలే మిగులుతాయి. అద్వితీయమైన మేథో సంపత్తి కలిగిన మానవ సంపద సృష్టికి ఇంకా కొన్ని వేల మైళ్ల దూరంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా పాఠశాల విద్యపై ప్రభుత్వం లోతైన అవగాహనతో ముందుకు సాగాలి.