మెగాస్టార్ @ వైఎస్సార్సీపీ?
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పార్టీ మారనున్నారా? సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారా? టాలీవుడ్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తూనే రాజ్యసభలో మరోసారి అడుగుపెట్టనున్నారా? అంటే అవుననే ఏపీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సినిమాల్లో తిరుగులేని ప్రస్థానంతో ప్రజాతంత్రంలో కూడా తనదైన పాత్రపోషించాలని రాజకీయాల్లోకి ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి అడుగుపెట్టారు. సీఎం అవడం తథ్యం […]
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పార్టీ మారనున్నారా? సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారా? టాలీవుడ్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తూనే రాజ్యసభలో మరోసారి అడుగుపెట్టనున్నారా? అంటే అవుననే ఏపీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
సినిమాల్లో తిరుగులేని ప్రస్థానంతో ప్రజాతంత్రంలో కూడా తనదైన పాత్రపోషించాలని రాజకీయాల్లోకి ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి అడుగుపెట్టారు. సీఎం అవడం తథ్యం అంటూ పార్టీ పెట్టిన ఆయన ప్రజామద్దతు కూడగట్టడంలో విఫలమయ్యారు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో, వాటిని అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలయ్యారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని భావించిన చిరంజీవి.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అభిమానులు, కార్యకర్తలను అవాక్కయ్యేలా చేశారు.
పార్టీని విలీనం చేయడంతో కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పోనీ తెలంగాణలో అయినా నిలబడిందా? అంటే అక్కడ కూడా ప్రతికూల ఫలితాలే.. దీంతో ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా ఆజాఅయిపూ లేకుండా పోయాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సినిమాలపై దృష్టి సారించారు. తన కుమారుడి బేనర్‌లోనే ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా’ సినిమాల్లో నటించి బిజీగా మారారు. ‘సైరా’ సినిమా విడుదల సమయంలో జగన్‌ను చిరంజీవి కలవడంతో మరోసారి రాజకీయాల్లో చేరేందుకు చిరంజీవి ఉత్సాహంగా ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి.
అయితే తన సినిమాను చూడాలని కోరడానికే జగన్‌ను కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో ఆ ఊహాగానాలకు అప్పట్లో తెరపడింది. మళ్లీ ఇంతకాలానికి ఆ చర్చ మరోసారి ఏపీలో మొదలైంది. 2014 నుంచి జగన్‌ను పవన్ కల్యాణ్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా అధికార పక్షాన్ని ఎవరైనా నిలదీస్తారు.. కానీ పవన్ కల్యాణ్ మాత్రం చిత్రంగా ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేవారు. తరువాతి ఎన్నికల్లో పవన్ పోటీ చేసినా.. ఫలితం లేకపోయింది. దీంతో ఆయన అన్నలా పార్టీని విలీనం చెయ్యకపోయినా బీజేపీతో పొత్తు కట్టి జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఇదిలావుండగా, వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను చేసిన తరువాత, అనూహ్యంగా చిరంజీవి దానికి మద్దతు పలికారు. మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం ముందడుగు వేస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వైసీపీలో చేరుతారన్న వార్తలకు బలం చేకూరింది. అతి త్వరలో ఇందుకు ముహూర్తం కూడా కుదిరిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, సినీ పరిశ్రమకు ప్రస్తుతం చిరంజీవి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు చిరంజీవిని కలిసి వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటున్నారు. మరోవైపు తనకు సూటైన సినిమా కథలను కూడా ఆయన సిద్దం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆయన మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా? అన్నది అయోమయానికి గురిచేస్తోంది. అయితే ట్రూజెట్ ఎయిర్‌లైన్స్‌తో రామ్ చరణ్ వ్యాపార రంగంలో ఉన్నాడు. చిరంజీవి కోడలు అపోలో హాస్పిటల్స్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో చిరంజీవి కొనసాగడం ఆ కుటుంబానికి అవసరంగా మారిందని, ఈ నేపథ్యంలోనే చిరంజీవి వైఎస్సార్సీపీలో చేరడం ఖాయమన్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.