ఉస్మానియాలో విచిత్రమైన పరిస్థితి
దిశ, తెలంగాణ బ్యూరో: మరో మూడు రోజుల్లో స్కూల్ ఆఫ్ నర్సింగ్లకు ప్రత్యక్ష తరగతులు షురూ కానున్నాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆన్లైన్ క్లాస్‌లకు పరిమితమైన విద్యార్ధులు సోమవారం నుంచి ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా రావాలని డీఎంఈ డా. రమేష్‌రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారుల మధ్య సమన్వయంతో నర్సింగ్ విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇన్నాళ్లు విద్యార్ధులెవ్వరూ క్లాస్‌లు, హాస్టళ్లలో లేనందున వరంగల్ ఎంజీఎం, గాంధీ, ఉస్మానియా […]
దిశ, తెలంగాణ బ్యూరో: మరో మూడు రోజుల్లో స్కూల్ ఆఫ్ నర్సింగ్లకు ప్రత్యక్ష తరగతులు షురూ కానున్నాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆన్లైన్ క్లాస్‌లకు పరిమితమైన విద్యార్ధులు సోమవారం నుంచి ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా రావాలని డీఎంఈ డా. రమేష్‌రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారుల మధ్య సమన్వయంతో నర్సింగ్ విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇన్నాళ్లు విద్యార్ధులెవ్వరూ క్లాస్‌లు, హాస్టళ్లలో లేనందున వరంగల్ ఎంజీఎం, గాంధీ, ఉస్మానియా స్కూల్స్‌లో గదులన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి.
శానిటేషన్, విద్యుత్, వాటర్ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. నల్లాలు లీకేజ్, శుభ్రత లేని బాత్ రూంలు, తరగతి గదుల్లో చెత్తా చెదారంతో నిండిపోయాయి. అంతేగాక కొన్ని చోట్ల డోర్లు, కిటికీలు కూడా పాడైపోయాయి. స్కూళ్ల ప్రారంభానికి కేవలం మూడు రోజుల కాల వ్యవధి ఉండటంతో నర్సింగ్ టీచర్లు ఆగమేఘాల మీద క్లీనింగ్ చేయించుకుంటున్నారు. గాంధీ, ఎంజీఎంలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉస్మానియాలో అతి దారుణంగా ఉంది. గతంలో స్కూల్ ఆఫ్ నర్సింగ్ కి కేటాయించిన బిల్డింగ్ లో ప్రస్తుతం సూపరింటెండెంట్‌తో పాటు అతని పేషీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో జీఎన్ఎం విద్యార్ధులు వస్తే ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కొంతమంది అధికారులు బిల్డింగ్ కొరకు సూపరింటెండెంట్ ను అడగ్గా, జీఎన్ఎంను ఉస్మానియా నుంచి తరలించేస్తే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో విద్యార్ధులంతా టెన్షన్ లో ఉన్నారు. తమకు కేటాయించిన బిల్డింగ్ లో సూపరింటెండెంట్ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఉస్మానియాలో 180 విద్యార్ధులు
జీఎన్ఎం మూడు సంవత్సరాల కోర్సులో ఉస్మానియా నర్సింగ్ స్కూల్ లో ప్రతీ ఏటా 180 మంది విద్యార్ధులు శిక్షణ పూర్తి చేసుకుంటారు. ప్రస్తుతం మూడో సంవత్సరానికి చెందిన 45 మంది విద్యార్ధులు క్లినికల్స్ కొరకు ఇప్పటికే హాస్టళ్లకు చేరుకోగా.. మొదటి, రెండవ సంవత్సరాలకు చెందిన స్టుడెంట్లు మరో మూడు రోజుల్లో చేరుకుంటారు. కానీ ఇప్పటి జీఎన్ఎం విద్యార్ధులకు బిల్డింగ్ కేటాయించలేదు. దీంతో ఒకవేళ విద్యార్ధులు వస్తే ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇటు ప్రభుత్వం, మరోవైపు సూపరింటెంటెంట్ స్పందించకపోవడంతో.. ఏం చేయాలో తెలియక నర్సింగ్ ఫ్యాకల్టీ కూడా తలలు పట్టుకుంటున్నారు.
ఇండెంట్ పెట్టాలే..
పాడైన నల్లాలు, లైట్లు, వాష్ రూం సామాగ్రీ, టేబుల్స్, తదితర వస్తువుల కొరకు ఇండెంట్ పెట్టాలని సూపరింటెండెంట్ చెబుతున్నారని నర్సింగ్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇండెంట్ పెడితే అవి ఆరు నెలలకు వస్తాయని పేర్కొంటున్నారు. కానీ మూడు రోజుల్లో తరగతులు ఎలా నిర్వహించాలో తమకు అర్థం కావడం లేదని ఓ అధికారిణీ దిశకు చెప్పారు.