జోడు పదవులు మరింత సులభం
దిశ, న్యూస్‌బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణకు శ్రీకారం చుట్టింది. శాసనసభ లేదా శాసనమండలి సభ్యులు నామినేటెడ్ పదవులు పొందకుండా అమల్లో ఉన్న చట్టానికి సవరణలు ప్రతిపాదించే బిల్లుకు అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. ఆ ప్రకారం 29 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఛైర్‌పర్సన్లు, డైరెక్టర్ల పదవులను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ చేపట్టడానికి ఇంతకాలం ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. లాభదాయక పదవులు (ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్) అనే నిబంధన కారణంగా ఎమ్మెల్యేలు లేదా […]
దిశ, న్యూస్‌బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణకు శ్రీకారం చుట్టింది. శాసనసభ లేదా శాసనమండలి సభ్యులు నామినేటెడ్ పదవులు పొందకుండా అమల్లో ఉన్న చట్టానికి సవరణలు ప్రతిపాదించే బిల్లుకు అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. ఆ ప్రకారం 29 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఛైర్‌పర్సన్లు, డైరెక్టర్ల పదవులను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ చేపట్టడానికి ఇంతకాలం ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. లాభదాయక పదవులు (ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్) అనే నిబంధన కారణంగా ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు జోడు పదవులు పొందే అవకాశం లేకుండా పోయింది. గతంలో సవరణ చేసిన ప్రభుత్వం 121 సంస్థలను ఆ చట్టం పరిధి నుంచి మినహాయించింది. ఇప్పుడు మరో 29 సంస్థలను కూడా తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టింది. మూజువాణి ఓటుతో ఇది ఆమోదం పొందింది. దీంతో మొత్తం 150 సంస్థల ఉన్నత పదవులను చేపట్టడానికి ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలకు అవకాశం లభించింది.
ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు ఆశించిన చాలామందికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని హామీలు ఇచ్చారు. ఇతర పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కొన్ని పదవులను ఆశించారు. అయితే లాభదాయక పదవుల నిబంధనతో వారు ఎమ్మెల్యేలుగా లేదా ఎమ్మెల్సీలుగా అనర్హతకు గురవుతారనే కారణంతో వారికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టలేదు. ఇప్పుడు ఆ చట్టానికి సవరణ చేసి అనర్హత వేటు పడకుండా ప్రభుత్వం బిల్లును రూపొందించడం, సభ ఆమోదం లభించడంతో సమీప భవిష్యత్తులో కొద్దిమందికి కొత్త పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొద్దిమందికి ఆ అవకాశం లభించగా కొత్తగా మినహాయింపు జాబితాలోకి చేరిన 29 సంస్థల్లో మరికొన్నింటికి త్వరలో ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.
చట్ట సవరణ ప్రకారం రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్, రైతు సమన్వయ సమితి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, లేబర్ వెల్ఫేర్ బోర్డు, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ పట్టణాభివృద్ధి సంస్తలు, స్పోర్ట్స్ అథారిటీలు, గొర్రెల-మేకల అభివృద్ధి సహకార సమాఖ్య, తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం, సజ్ కమిటీ, సోషల్ వెల్ఫేర్ బోర్డు, రాష్ట్ర ఆహార సంస్థ, సాహిత్య అకాడమీ తదితర 29 సంస్థల ఛైర్‌పర్సన్ పదవులకు ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలను నామినేట్ చేసే అవకాశం ఈ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వానికి లభించింది. గతంలో హామీ ఇచ్చినవారికి ఇకపై ఈ పదవులను కట్టబెట్టడానికి మార్గం సుగమమైంది.
అభయహస్తం రద్దు
వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు ఉనికిలోకి వచ్చిన అభయహస్తం పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక బిల్లును సభలో ప్రవేశపెట్టింది. 65 ఏళ్ళ వయసు నిండిన వృద్ధ మహిళలు ప్రతీ నెలా రూ. 500 చొప్పున ఈ పథకం కింద పింఛను అందుకునే వెసులుబాటు ఈ చట్టం ద్వారా లభించింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘ఆసరా పింఛను’ పథకం అమల్లోకి రావడంతో ప్రతీ నెలా రూ. 2,016 అందుతున్నందున ఇకపైన ‘అభయహస్తం’ పథకం ఎంతమాత్రం అవసరం లేదని, అంతకంటే ఎక్కువ సాయం అందుతున్నందున ఈ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు బిల్లు స్పష్టం చేసింది. ఇప్పటికీ అభయహస్తం పథకం లబ్ధిదారులుగా ఉన్న మహిళలంతా ఆసరా పింఛను పథకం కిందకి వస్తారని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్ళ పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ముఖ్యమంత్రి తరపున మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభిస్తే గవర్నర్ అనుమతితో గెజిట్ విడుదల కానుంది. నకిలీ రిజిస్ట్రేషన్ల ఇబ్బందిని తొలగించుకోడానికి వీలుగా జీఎస్టీ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సైతం సభ ఆమోదం లభించింది. లోకాయుక్త మూల చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తులకు లోకాయుక్తగా నియమితులయ్యే అర్హత లభిస్తుంది. అయితే తెలంగాణ హైకోర్టులో అలాంటి అర్హత కలిగినవారు ఉండకపోవచ్చనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం మూల చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సవరణ ప్రకారం హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కాకపోయినా సాధారణ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వ్యక్తికి సైతం అర్హత లభిస్తుంది. న్యాయశాఖ మాజీ కార్యదర్శి నిరంజన్‌రావును లోకాయుక్తగా నియమింపజేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిందనేది బహిరంగ రహస్యం.
tags : Telangana, Assembly, Lokayukta, Nominated Posts, Office of the Profit, Amendment Bills, Cm KCR, Min Prashanth Reddy