తిరుపతిలో మార్చి 24- 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 11వ తేదీ గురువారం మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరుగనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా గురువారం ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 7 నుండి 8 గంటల వరకు […]
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 11వ తేదీ గురువారం మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరుగనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా గురువారం ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఏకాంతంగా భోగితేరు ఆస్థానం, ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఏకాంతంగా నంది వాహనం ఆస్థానం నిర్వహిస్తారు. మార్చి 12వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
మార్చి 11న ధ్యానారామంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం
టిటిడి చేపట్టిన మాఘ మాస ఉత్సవాల్లో భాగంగా మార్చి 11న గురువారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆవరణలో గల ధ్యానారామంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగనుంది. ఉదయం 7 నుండి 8 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు, వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధులలో ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా మార్చి 24, 25వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వర్చువల్ సేవ), మార్చి 26, 27, 28వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ (వర్చువల్ సేవలు)లను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
మార్చి 12 నుండి 20వ తేదీ వరకు టిటిడి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు
టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను మిగిలిన సీట్ల కోసం మార్చి 12 నుండి 20వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు విద్యా విభాగం డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాస్టల్ సీట్లు కల్పించబడవని, స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ఇదివరకే http://oamdc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మొదటి, రెండు, మూడో విడతల్లో ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేశారు. మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. మార్చి 12 నుండి 20వ తేదీ వరకు శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుండి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. అదేవిధంగా, మార్చి 15 నుండి 20వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి స్పాట్ అడ్మిషన్లు చేపడతారు. కళాశాల సీట్లు మాత్రమే కావాల్సిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణపత్రాలు, ఫీజులతో నేరుగా సంబంధిత డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని కోరడమైనది.
దేశవాళీ గోజాతి అభివృద్ధికి గోశాలలో పిండమార్పిడి విధానానికి శ్రీకారం
టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో దేశవాళీ గోజాతి అభివృద్ధి కోసం ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దూరదృష్టితో చేసిన ఆదేశం మేరకు అధికారులు పిండమార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. తద్వారా అధిక పాల ఉత్పత్తి దిశగా గోశాల అడుగులు వేస్తోంది. గోశాలలో సంతానోత్పత్తి సామర్థ్యం గల గోవులకు మేలుజాతి దేశవాలి గోజాతుల పిండాలను మార్పిడి చేసి కృత్రిమ గర్భధారణ కలిగించి, ఆశించిన ఫలితాలు పొందేందుకు పిండమార్పిడి విధానం దోహదపడుతుంది. దీనివల్ల అంతరించిపోతున్న భారతీయ గోజాతుల పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమవుతుంది.