కార్మికుల ప్రాణాలు పణం

– లాక్‌డౌన్‌లోనూ ఎస్ఆర్డీపీ పనులు దిశ, న్యూస్ బ్యూరో: ‘ఎవరికో బుద్ధి చెప్పి ఎవరో ఏదో చేశారని’ తెలుగులో ఓ మోటు సామెత. సరిగ్గా బల్దియా యంత్రాంగానికి ఇది సరిపోతుందేమో.. కరోనా నివారణా చర్యల్లో భాగంగా సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం అందరికీ చెబుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కూడా తన వంతు పాత్రను వహిస్తోంది. కరోనా అవగాహన ప్రచారం చేయడంతో పాటు అవసరమైన వారికి అన్నదానం, వసతి కల్పించడం వంటి చర్యలతో బల్దియా అందరి అభిమానాన్ని […]

Update: 2020-04-04 09:20 GMT

– లాక్‌డౌన్‌లోనూ ఎస్ఆర్డీపీ పనులు

దిశ, న్యూస్ బ్యూరో: ‘ఎవరికో బుద్ధి చెప్పి ఎవరో ఏదో చేశారని’ తెలుగులో ఓ మోటు సామెత. సరిగ్గా బల్దియా యంత్రాంగానికి ఇది సరిపోతుందేమో.. కరోనా నివారణా చర్యల్లో భాగంగా సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం అందరికీ చెబుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కూడా తన వంతు పాత్రను వహిస్తోంది. కరోనా అవగాహన ప్రచారం చేయడంతో పాటు అవసరమైన వారికి అన్నదానం, వసతి కల్పించడం వంటి చర్యలతో బల్దియా అందరి అభిమానాన్ని పొందుతోంది. కాని కొన్ని చోట్ల బల్దియా వ్యవహార శైలి విమర్శల పాలవుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఆర్డీపీ పనులను లాక్‌డౌన్ సమయంలో కొనసాగిస్తున్నారు. అభివృద్ధి కోసమేనంటూ బల్దియా యంత్రాంగం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, కరోనా వైరస్ (కొవిడ్-19) వంటి తీవ్ర వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో మాన్యువల్‌ పనులు కొనసాగించాల్సిన అవసరమేమిటో అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అంతగా కావాలనుకుంటే మిషనరీ పనుల వరకూ ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రోడ్ల మీద ప్రజలు, వాహనాల రద్దీ తక్కువగా ఉంది. కాబట్టి పనులు చేపట్టేందుకు చాలా అనుకూలంగా ఉంటుందని బల్దియా యంత్రాంగం, నాయకులు చెప్పుకొస్తున్నారు. పనులు చేపట్టడానికి వెసులుబాటుగా ఉందనే ఒకే కారణంతో ప్రాజెక్టు పనులు ఎంత వరకూ సమంజసమో వారికే తెలియాలి. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపునిస్తారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం అంత అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరమేమీ లేదు కదా.. ఆ తర్వాత కూడా చేపట్టొచ్చు..ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందుగా ఊహించరు. ట్రాఫిక్, ఇతర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ప్రాజెక్టు పనులు చేపడుతారు. అన్ని సక్రమంగా ఉన్నా నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ప్రారంభించిన ప్రాజెక్టులో నగరంలో చాలా ఉన్నాయి. మరీ అంతగా పనులు చేయాలనుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.

గాలికి కార్మికుల భద్రత.. వారి బాధ్యత ఎవరిది ?

ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయాలని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంతే అమాత్యుడు చెప్పిందే తడవుగా ఎక్కడికక్కడ పనులు మొదలు పెట్టారు. అభివృద్ధి పనులు ఎవరూ కాదనడం లేదు కాని ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో అత్యవసరంగా బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించాల్సిన అవసరమేమిటో.. లాక్‌డౌన్ ప్రకటనతో బీహార్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ వరకూ కార్మికులు కాలినడకన ఇండ్లకు బయలు దేరారు. స్థానిక కార్మికులు కూడా సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు నగరంలో అందుబాటులో ఉన్న కార్మికులు ఎంతమంది.. వారి పనిచేస్తే ఆ పనులు ఎప్పటికి పూర్తి కావాలి ?.. కరోనా భయానికి అందరిని ఇంటి పట్టున ఉండమనే బల్దియా కార్మికులను రోడ్ల మీదకు తెచ్చి పనులు చేయించడం, వారికి కనీసం రక్షణ చర్యలు కనిపించకపోవడం వారి నిర్లక్ష వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది.

నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో జరుగుతున్న కార్మికులకు మాస్క్‌లు, శానిటైజర్ల వంటివి కనిపించడం లేదు. స్వయంగా మేయర్ వచ్చి ఈ పనులను శనివారం పరిశీలించడం గమనార్హం..లాక్‌డౌన్ సమయంలో కార్మికులు పనిచేయకున్నా వారికి జీతమివ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. సొంత ప్రాంతాలకు వెళ్లలేక పోయిన వలస కార్మికులను ఇలా వాడుకుంటున్నారు. పనిలోకి వచ్చిన రోజే జీతం చెల్లిస్తారని బీహార్‌కు చెందిన ఓ కార్మికుడు తెలిపాడు. కార్మికుల శ్రమదోపిడీకి స్వయంగా జీహెచ్ఎంసీ పాల్పడుతుంటే నగరంలో ప్రైవేటు కంపెనీలు, కాంట్రాక్టర్లు ఏ విధంగా వ్యవహరిస్తారో.. కార్మికులు పనిలో ఉన్నపుడు రక్షణ చర్యలతో పాటు పరిశీలకులను కూడా సదరు కాంట్రాక్టర్ సంస్థలు నియమించాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు వారికి ఎల్లప్పుడూ రక్షణ చర్యలు, పర్యవేక్షణ తప్పనిసరి. ఇలాంటి నిబంధనలేమీ ఇక్కడ అమలు కావడం లేదు.

ఆయా కార్మికులు పనిచేసే సమయంతో పాటు, నివాస ప్రాంతాలకు వాహనాల ద్వారా ప్రయాణించేటపుడు సామాజిక దూరం పాటించడం లేదు. రోడ్ల మీద తిరిగే వాళ్లకు వారికి కరోనా సోకేందుకు బల్దియానే అవకాశం కల్పించినట్టు అవుతోంది. ఒకవేళ కార్మికులకు కరోనా సోకినా.. ఏదైనా ప్రమాదం జరిగినా కాంట్రాక్టర్లు, బల్దియాల్లో ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్న. వారి లాభాల కోసం, రేపు వచ్చే ఎన్నికల్లో ఏదో చేశామని చెప్పుకునేందుకు కాంట్రాక్టర్ల ప్రాణాలను బలిపెడుతున్న బల్దియా అధికారులు పునరాలోచించుకోవాలి. పొట్టకూటి కోసం సొంత ప్రాంతాలను వదిలి భాష కూడా తెలియక బతుకుదామనుకున్న వారి జీవితాలతో చెలగాటం ఆడటం మానివేస్తే మంచిది. నోటి మాటతోనే పనులు చేస్తున్న అధికారులు కేవలం అమాత్యుడి మెప్పు పొందేందుకు బల్దియా తన ఇష్టానుసారం వ్యవహరించినట్టు కనిపిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో కనీస సేఫ్టీ చర్యలు తీసుకోకుండానే కార్మికులు పనులు చేపడుతున్నారు. ఎస్‌ఆర్డీపీ పనులనేవి అధికార పార్టీకి, యంత్రాంగాలకు కీలకమైనవే. కాని కార్మికుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టి చేయాల్సిన అవసరం లేదు. నగరంలో పనులు చేసేందుకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేదా జీఓలు కూడా విడుదల చేయలేదు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నుంచి కాని, అధికారిక అనుమతి లేకుండా పనులు కొనసాగడం దేనికి సంకేతం ? ఏ నిబంధనల కింద ఈ పనులు చేపడుతున్నారో.. అనుకోని ఘటనలకు ఎవరి బాధ్యత వహిస్తారంటే అధికారుల వద్ద సమాధానం లేదు. పనులు చేసేవారికి ఏమైనా జరిగితే చేతులు పట్టుకోవడం తప్ప వారికి మరే అవకాశం లేదు.

Tags: GHMC, Srdp,ktr,telangana, Labour, Lockdown

Tags:    

Similar News