ఆ విషయంలో జడేజా తప్పు లేదు : అశ్విన్

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు దశబ్దాలుగా భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Update: 2024-09-02 19:21 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు దశబ్దాలుగా భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సొంతగడ్డపై ఈ స్పిన్ ద్వయం ప్రత్యర్థి జట్లను ఏ విధంగా బెంబేలెత్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, విదేశీ టెస్టులకు వచ్చే సరికి జట్టు ఎంపికలో సెలెక్టర్లు జడేజా వైపు మొగ్గుచూపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశ్విన్‌కు ప్రశ్న ఎదురైంది. ఆ పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఉంటారని అడగ్గా.. అశ్విన్ బదులిస్తూ ‘మీరు అసూయ గురించి మాట్లాడుతున్నారా?. జడేజాపై నాకు ఎలాంటి అసూయ లేదు.’ అని స్పష్టం చేశాడు. ‘అతను చాలా ప్రతిభావంతుడు. చాలా ఏళ్లుగా మా మధ్య మంచి బంధం ఉంది. అయినా నేను ఆడకపోవడంలో జడేజా తప్పు లేదు. నేను ఆడటం కోసం అతన్ని దూరం పెట్టాలనే అసూయ నాకు లేదు. ఆటల్లో అసూయ అనే భావనను అధిగమించాలి. జాతీయ జట్టుకు ఆడని ప్లేయర్లతో సరైన కమ్యూనికేషన్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. జట్టు అవసరాల కోసం ఏ ఆటగాడి స్థానంలోనైనా మరొకరిని భర్తీ చేస్తే అది తప్పు కాదు.’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అశ్విన్, జడేజా ఆడే అవకాశాలు ఉన్నాయి. 


Similar News