ఫైనల్‌కు తెలుగమ్మాయి ఆకుల శ్రీజ
వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ కార్పస్ క్రిస్టీ టోర్నీలో హైదరాబాదీ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తాచాటింది.
దిశ, స్పోర్ట్స్ : అమెరికాలో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ కార్పస్ క్రిస్టీ టోర్నీలో హైదరాబాదీ అమ్మాయి, భారత స్టార్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ సత్తాచాటింది. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సెమీస్‌లో శ్రీజ 3-2(9-11, 11-5, 11-5, 10-12, 11-9) తేడాతో అమెరికా క్రీడాకారిణి జియాంగ్షాన్ గువోను ఓడించింది. చివరి గేమ్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట శ్రీజకు శుభారంభం దక్కలేదు. తొలి గేమ్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బలంగా పుంజుకున్న ఆమె వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, పోటాపోటీగా జరిగిన నాలుగో గేమ్‌లో అమెరికా క్రీడాకారిణి పైచేయి సాధించడంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో గేమ్‌కు వెళ్లింది. చివరి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా పట్టుదల ప్రదర్శించిన శ్రీజ ఆ గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ దక్కించుకుంది. ఫైనల్లో అమెరికాకే చెందిన లిల్లీ జాంగ్‌తో శ్రీజ తలపడనుంది. మెన్స్ సింగిల్స్‌లో భారత ఆటగాడు మానవ్ వికాశ్ ఠాకూర్ సెమీస్‌లో పరాజయం పాలయ్యాడు.