రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం అదే : అశ్విన్
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. సిరీస్ మధ్యలో వీడ్కోలు పలుకడంతో అతని రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరిగింది. అయితే, తాజాగా అశ్వినే స్వయంగా తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని వివరించాడు. స్కై స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తనలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనిపించిందని, అందుకే వీడ్కోలు పలికినట్టు వెల్లడించాడు.‘ఈ రోజు నాదైంది. రేపు కూడా నాదవుతుందని విశ్వసించను. సుదీర్ఘ కెరీర్‌లో ఆ ఆలోచన తీరే నా ఎదుగుదలకు కారణం. రిటైర్మెంట్ గురించి కొన్ని సార్లు ఆలోచించా. నిద్రలేచిన క్షణంలో నా సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనిపిస్తే ఆ రోజే ఆటను వదిలేయాలని అనుకున్నా. అనూహ్యంగా ఆ రోజు నాకు అనిపించింది.’అని చెప్పాడు.
రిటైర్మెంట్‌పై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, క్రికెట్ తనకు చాలా ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. టెస్టు క్రికెట్ తనకు లైఫ్ టీచర్ అని చెప్పాడు. ‘టెస్టు క్రికెట్ చాలా కాలం ఆడాను. నా జీవితంలో ఎలా నిర్మించుకోవాలో, ఎలా జీవించాలో నేర్పింది. అని తెలిపాడు. కాగా, 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అశ్విన్ భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. 106 టెస్టుల, 116 వన్డేలు, 65 టీ20ల్లో కలిపి మొత్తం 765 వికెట్లు తీశాడు. కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా, వరల్డ్ క్రికెట్‌లో 11వ బౌలర్‌గా కెరీర్‌ను ముగించాడు.