World Archery Championships: చరిత్ర సృష్టించిన భారత మహిళా ఆర్చర్లు..

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత మహిళా ఆర్చర్లు చరిత్ర సృష్టించారు.

Update: 2023-08-04 15:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత మహిళా ఆర్చర్లు చరిత్ర సృష్టించారు. వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన ఆర్చర్లుగా జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్‌ కౌర్‌, అదితి గోపీచంద్‌ రికార్డులకెక్కారు. జర్మనీలోని బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత జట్టు మెక్సికన్‌ టీమ్‌పై 235-229తో గెలిచింది. డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్‌ జియోన్‌, ఆండ్రియా బెసెర్రాలపై పైచేయి సాధించి గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది.

దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 11కు చేరింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో ఇది ఆరో పతకం కావడం విశేషం. 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఇప్పటి వరకు టీమ్‌ విభాగంలో రెండు రజతాలు (2021, 2017), ఒక కాంస్యం (2019).. వ్యక్తిగత విభాగంలో ఒక రజతం (2021), ఒక కాంస్యం (2019) తన ఖాతాలో వేసుకుంది.


Similar News