ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు భారత్ ఆతిథ్యం.. మహిళల ఎఫ్‌టీపీ 2025-29 రిలీజ్

మహిళల ఫ్యూచర్ టూర్ ప్రొగ్రామ్(ఎఫ్‌టీపీ) 2025-29ను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది.

Update: 2024-11-04 13:13 GMT

దిశ, స్పోర్ట్స్ : మహిళల ఫ్యూచర్ టూర్ ప్రొగ్రామ్(ఎఫ్‌టీపీ) 2025-29ను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది. గత ఎఫ్‌టీపీ 2022-25తో పోలిస్తే అన్ని ఫార్మాట్లలో మ్యాచ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టిన ఐసీసీ.. టెస్టుల సంఖ్యను పెంచింది. టెస్టులు, వన్డేలు, టీ20లతో కూడిన మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు ఆడేందుకు జట్లు అంగీకరించాయి. అలాగే, ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌‌లో కొత్తగా జింబాబ్వేను చేర్చుతూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో జట్ల సంఖ్య 11కు చేరింది. మొత్తంగా ఈ సర్కిల్‌లో 11 జట్లు మూడు ఫార్మాట్లలో 400కుపైగా మ్యాచ్‌లు ఆడనున్నాయి. అలాగే, ఏడాదికో ఐసీసీ ఈవెంట్‌‌ను నిర్వహించనుంది. వచ్చే ఏడాది మహిళల వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. 2026లో మహిళల టీ20 వరల్డ్ ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. ప్రారంభ మహిళల చాంపియన్స్ ట్రోఫీ 2027లో జరగనుండగా ఆ టోర్నీకి శ్రీలంక వేదిక. 2028లో టీ20 వరల్డ్ కప్(ఇంకా వేదిక ఖరారు కాలేదు) నిర్వహించనుంది. అదే ఏడాది లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్‌ను చూడబోతున్నాం. 2029‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుండగా.. జింబాబ్వే చేరికతో ఆ టోర్నీలో 11 జట్లు పాల్గొననున్నాయి. ఏడాదికో ఐసీసీ టోర్నీ నేపథ్యంలో ఆయా జట్లు గతంతో పోలిస్తే ఎక్కువగా ట్రై సిరీస్‌లు ఆడనున్నాయి.

ఇంగ్లాండ్, ఆసిస్ జట్లకు భారత్ ఆతిథ్యం

ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా 11 జట్లు నాలుగు సిరీస్‌లు స్వదేశంలో, నాలుగు సిరీస్‌లు విదేశాల్లో ఆడనున్నాయి. 44 సిరీస్‌ల్లో 132 వన్డేలు ఆడనున్నాయి. అందులో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు కూడా భారత్‌లో పర్యటించనున్నాయి. అలాగే, భారత మహిళల జట్టు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్‌లలో పర్యటించనుంది. అంతేకాకుండా, టీ20 వరల్డ్ కప్-2026కు ముందు భారత్.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో ట్రై సిరీస్ ఆడనుంది.

Tags:    

Similar News