Women's Asian Champions Trophy 2024 : ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటింది.
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ-2024లో ఒక్క ఓటమి చవిచూడకుండా టైటిల్ విజేతగా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్‌లో చైనాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ట్రోఫీని రెండో సారి నిలుపుకుంది. చైనాతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో 1-0 తేడాతో భారత్ విజయఢంకా మోగించింది.
సత్తా చాటిన దీపికా షెరావత్
బీహార్ రాష్ట్రం రాజ్‌గిర్‌లో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇన్ ఫామ్ ఫార్వర్డ్ క్రీడాకారిణి దీపికా షెరావత్ సత్తా చాటింది. థర్డ్ క్వార్టర్‌లో దీపికా గోల్ కొట్టడంతో టైటిల్ పోరులో భారత మహిళల జట్టు విన్నర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక గోల్ నమోదు కాగా.. సెన్సేషనల్ స్ట్రయిక్‌తో పెనాల్టీ కార్నర్‌ను దీపికా గోల్‌గా మలిచింది. దీంతో టోర్నమెంట్‌లో దీపికా 11వ గోల్‌ను నమోదు చేసింది. 31వ నిమిషంలో గోల్ కొట్టిన దీపికా భారత్‌ను ఫైనల్‌లో ఆధిక్యంలో నిలిపింది. తొలి అర్ధ భాగంలో ఇరుజట్లు ఒక్క గోల్ చేయలేకపోయాయి. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి జునున్ కవాయి దీపికను నెట్టేయడంతో పెనాల్టీ పడింది. వచ్చిన ఈ అవకాశాన్ని దీపికా సద్వినియోగం చేసుకుని పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది.
స్కోరు డిఫెండ్ చేయడంతో..
రెండో అర్ధ భాగంలో స్కోరును సమం చేయడానికి చైనా ప్రయత్నించినా భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతో డిఫెండ్ చేసింది. మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక గోల్స్ కొట్టిన క్రీడాకారిణిగా దీపిక నిలిచింది. ఈ టోర్నీలో ఐదు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో భారత్ వరుస విజయాలతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్‌లో జపాన్‌ను 2-0 తేడాతో చిత్తు చేసింది. వరుసగా ఆరు గెలుపులతో భారత్ రెండు సార్లు ఫైనల్‌కు చేరిన చైనాతో తుదిపోరులో తలపడింది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.
మూడో సారి టైటిల్ సొంతం..
ఈ మెగా టోర్నీలో భారత మహిళల జట్టు చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. సౌత్ కొరియాతో కలిసి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. 2016, 2023లలో భారత్ మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2013, 2018లో ఫైనల్‌కు చేరిన భారత్ రన్నరప్‌గా నిలిచింది.