జై షా తర్వాత ఎవరు?.. బీసీసీఐ సెక్రెటరీ రేసులో ఉన్నది వీళ్లే

బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్ పదవిని అలంకరించనున్నారా? అంటే క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది.

Update: 2024-08-23 19:10 GMT

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్ పదవిని అలంకరించనున్నారా? అంటే క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఐసీసీ చైర్మన్ రేసులో ఉండటంపై జై షా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ, అతను పోటీలో ఉంటే మాత్రం ఎన్నిక ఏకగ్రీవమే కానుంది. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్‌లే పోటీ నుంచి వైదొలగడంతో జై షా పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయడానికి ఈ నెల 27 చివరి తేదీ. జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైతే తదుపరి బీసీసీఐ సెక్రెటరీ ఎవరు? అనే చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది.

బీసీసీఐ సెక్రెటరీ జై షా తొలిసారిగా 2019లో బాధ్యతలు చేపట్టారు. 2022 తిరిగి ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు పదవీకాలం ఉంది. అయితే, జై షా ఐసీసీ చైర్మన్‌ పోస్టుపై ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైతే జై షా డిసెంబర్ 1 నుంచే బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో క్రికెట్ వర్గాల్లో బీసీసీఐలో జై షా స్థానాన్ని భర్తీ చేసెదెవరో? అన్న చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ పోటీలో ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రాజీశ్ శుక్లా 2000 నుంచి బీసీసీఐలో భాగంగా ఉన్నారు. అతన్ని ఏడాదిపాటు సెక్రెటరీగా ఉండాలని కోరే అవకాశం ఉంది. అలాగే, అరుణ్ ధుమాల్ గతంలో బీసీసీఐ ట్రెజరర్‌గా పని చేశాడు. ట్రెజరర్ ఆశిష్ కూడా గట్టిపోటీదారే. దాదాపు రెండేళ్లుగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో భాగమైన ఆశిష్‌కు కూడా సెక్రెటరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరితోపాటు జాయింట్ సెక్రెటరీ దేవజిత్ సైకియా, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 


Similar News