15 ఏళ్ల వయసులో కాలు కోల్పోయి.. రాకెట్‌లా దూసుకొచ్చిన పారా షట్లర్ నితేశ్

భారత పారా షట్లర్ నితేశ్ కుమార్ పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు.

Update: 2024-09-02 13:15 GMT

దిశ, స్పోర్ట్స్ : అప్పుడు అతని వయసు 15 ఏళ్లు.. అందరిలాగే పుస్తకాలతో కుస్తీ పడుతూ, జీవిత లక్ష్యాలను నిర్దేశించుకునే ఆలోచనలు చేసే ఆ వయసులో ఆ కుర్రాడి జీవితం భారీ కుదుపునకు లోనైంది. 2009లో జరిగిన ఓ ప్రమాదంలో తన కాలు కోల్పోయి నెలలపాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. ఇక, చదువుపై ఫోకస్ పెట్టిన అతను ఐఐటీ‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే రాకెట్ పట్టుకున్న ఆ కుర్రాడు ఇక బ్యాడ్మింటన్‌ను వదల్లేదు. పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి దేశాన్ని గర్వపడేలా చేశాడు. ఆ కుర్రాడు మరెవరో కాదు నితేశ్ కుమార్.

హర్యానాకు చెందిన నితేశ్ కుమార్‌కు పుట్టుకతో వైకల్యం లేదు. 15 ఏళ్ల వయసులో 2009లో వైజాగ్‌లో జరిగిన ఓ రైల్వే ప్రమాదంలో అతను తన కాలును కోల్పోయాడు. అప్పటి వరకు అతను ఫుట్‌బాల్‌ ఆటను ఇష్టపడేవాడు. అలాగే, పోలీస ఆఫీసర్ అవ్వాలని లేదా ఆర్మీలో చేరాలని అనుకునేవాడు. కానీ, ఆ ప్రమాదం అతని ఆశలను చిదిమేసింది. చాలా నెలలపాటు అతను మంచం నుంచి కదల్లేని పరిస్థితి. కోలుకున్న తర్వాత కూడా ఆ ప్రమాదం ఆలోచనల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. కానీ, క్రీడలపై అతని మక్కువ అలాగే ఉంది. అదే సమయంలో చదువులో కూడా నితేశ్ చురుకుగా ఉండేవాడు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటీ మండిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అక్కడే నితేశ్‌‌కు బ్యాడ్మింటన్ క్రీడలో బీజం పడింది. మొదట స్నేహితులతో కలిసి ఆడిన అతను ఆ తర్వాత ఆటపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో దివ్యాంగుల గురించి జరిగిన ఓ సమావేశం ద్వారా అతనికి కొత్త అవకాశాలు వచ్చాయి. అలా 2016లో బ్యాడ్మింటన్ కెరీర్‌ను మొదలుపెట్టిన నితేశ్ అదే ఏడాది జాతీయ అరంగేట్రం చేశాడు. ఫరిదాబాద్‌లో జరిగిన పారా జాతీయ పోటీల్లో కాంస్యం సాధించడంలో అతని ఆటలో మొదటి విజయం. అక్కడి నుంచి అతను అంచెలంచెలుగా ఎదిగాడు. 2018 పారా ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన అతను.. గతేడాది జరిగిన క్రీడల్లోనూ మూడు కేటగిరీల్లో స్వర్ణం, రజతం, కాంస్యం సాధించాడు. ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 కేటగిరీలో వరల్డ్ నం.1గా ఉన్నాడు.

కోహ్లీకి బిగ్ ఫ్యాన్

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు ఫిట్‌నెస్ విషయంలో ఎంతో మందికి స్ఫూర్తి. అలా స్ఫూర్తి పొందిన నితేశ్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్ అయ్యాడు. ఫిట్‌నెస్ విషయంలో విరాట్‌ను ఆరాధిస్తాడు. ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి నితేశ్ మాట్లాడుతూ..‘కోహ్లీని ఆరాధిస్తాను. తనను తాను ఫిట్ అథ్లెట్‌గా మార్చుకున్నాడు. 2013కు ముందు అతను ఎలా ఉండేవాడు. ఇప్పుడు అంతే ఫిట్‌గా, క్రమశిక్షణతో ఉన్నాడు.’ అని చెప్పాడు. 

Tags:    

Similar News