ఫార్మాట్ ఏదైనా..కోహ్లీ,రోహిత్‌ల భర్తీ కష్టమే!
దిశ, స్పోర్ట్స్ బ్యూరో : టీమిండియా కీలక ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ బ్యూరో : టీమిండియా కీలక ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ ఒకరి తర్వాత మరొకరు వీడ్కోలు పలకడంతో టీ20 అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. రోహిత్, కోహ్లీ లేని పరిమిత ఓవర్ల మ్యాచ్‌ను ఎలా చూడగలం అంటూ సోషల్ మీడియాలోనూ చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, రోహిత్, కోహ్లీ టీ20లకు దూరమైన వన్డేలు, టెస్టు మ్యాచులకు మరికొంత కాలం సేవలందించనున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాలో తదుపరి రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసేదెవరనే అంశంపై కీలక చర్చ జరుగుతోంది.
భారత జట్టులో ఎవరున్నారు?
ఇకపోతే విరాట్, రోహిత్ శర్మలు తమ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను సాధించారు. భారత్ క్రికెట్‌కు ఎంతో కాలంగా విశేష సేవలు అందిస్తున్నారు. రెండు టీ20 ప్రపంచ కప్‌లు టీమిండియా సాధించడంలోనూ వీరిద్దరి పాత్ర ఎనలేనిది. వీరిలోటును పూడ్చే వారు ఎవరు? భారత జట్టులో అటువంటి క్రీడాకారులు ఎవరున్నారు? అని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే విరాట్, రోహిత్ మైదానంలో ఉన్నారంటే ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించడంతో పాటు భారత క్రికెట్ అభిమానులకు అసలైన ఎంటర్టైన్మెంట్ చూపిస్తారు.
కుర్రాళ్లు భర్తీ చేయగలరా?
ప్రస్తుతం టీమిండియాలో నైపుణ్యంతో కూడిన క్రికెట్ ఆడే వాళ్లు చాలానే ఉన్నారు. కానీ వారెవ్వరూ భవిష్యత్‌లో కోహ్లీ, రోహిత్‌లు సాధించిన రికార్డులను అందుకోగలరా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కుర్రాళ్లు బాగానే ఆడుతున్నా.. కోహ్లీ, రోహిత్‌లు టీమిండియాకు నిరంతరాయంగా సేవలందించారు. ఫిట్నెస్ విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ, నాయకత్వంలోనూ, జట్టును ముందుండి నడిపించడంలోనూ వీరిద్దరూ అస్సలు రాజీపడలేదు. వరల్డ్ కప్స్, చాంపియన్స్ ట్రోఫీలు, ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌లోనూ వీరి క్రీడా ప్రతిభ అసాధారణం. వీరిద్దరి లాగా అంతకాలం ఇప్పటి యువ ఆటగాళ్లు ఒత్తిడిని జయించి అన్ని ఫార్మాట్లలో జట్టును ముందుండి నడిపించగలరా? అటువంటి క్రికెటర్ ఎవరని అటు దిగ్గజ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానుల్లో సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరువురి టీ20 రికార్డులు పదిలం..
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టీ20 కెరీర్‌లో మొత్తం 125 మ్యాచులు ఆడి ఏకంగా 4,188 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ విషయానికొస్తే 2007 నుంచి అంతర్జాతీయ మ్యాచులు ఆడటం ప్రారంభించాడు. అతను 159 టీ20 మ్యాచుల్లో 4,231 పరుగులు రాబట్టారు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండగా.. 29కు పైగా హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2024 టీ20 వరల్డ్ కప్ విజయోత్సాహం అనంతరం ముందు విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు.
వారిద్దరూ సచిన్, ధోనిలాంటివారు : కపిల్ దేవ్
‘ఫార్మాట్ ఏదైనా.. రోహిత్, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమే. భారత క్రికెట్‌కు వారు గొప్ప సేవ చేశారు. టీ20 ప్రపంచకప్ విజయంతో వీరికి గొప్ప వీడ్కోలు లభించింది. విరాట్ అన్ని ఫార్మాట్లలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కచ్చితంగా అతన్ని టీ20 ఫార్మాట్‌లో మిస్ అవుతాం. ఇక రోహిత్ తన షాట్స్‌తో మైదానంలో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేవారు. ఇప్పుడు వాటిని చూడలేం. వీరిద్దరూ టీమిండియాకు సచిన్, ధోనిలాంటి వారు. వీరిని రీప్లేస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని’ అంటూ మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.