యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన టాప్ సీడ్ సిన్నర్, స్వైటెక్

యూఎస్ ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1, ఇటలీ స్టార్ జెన్నిక్ సిన్నర్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.

Update: 2024-09-03 16:08 GMT

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1, ఇటలీ స్టార్ జెన్నిక్ సిన్నర్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ప్రీక్వార్టర్స్‌ను దాటేందుకు సిన్నర్ శ్రమించాల్సి వచ్చింది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌లో సిన్నర్ 7-6(7-3), 7-6(7-5), 6-1 తేడాతో అమెరికా ప్లేయర్ టామీ పాల్‌పై పోరాడి గెలిచాడు. మూడు సెట్లలో తొలి రెండు సెట్లను సిన్నర్ టై బ్రేకర్‌లోనే గెలిచాడంటే ప్రత్యర్థి నుంచి అతనికి ఎదురైన పోటీని అర్థం చేసుకోవచ్చు. మూడో సెట్‌లో మాత్రం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పాల్ మూడు డబుల్ ఫౌల్ట్స్, 43 అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయాడు. సిన్నర్ 33 తప్పులు చేశాడు. 10 ఏస్‌లు 29 విన్నర్లు కొట్టిన అతను 4 సార్లు పాల్ సర్వీస్‌లను బ్రేక్ చేశాడు.

మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1, టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్(పొలాండ్) కూడా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో 16వ సీడ్ సామ్సోనోవా‌ను 6-4, 6-1 తేడాతో చిత్తు చేసింది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ స్వైటెక్ రెండు సెట్లలోనే గెలుపొందింది. 3 ఏస్‌లు, 14 విన్నర్లు బాదిన ఆమె 3సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. దూకుడుగా ఆడిన ఆమె గంటా 30 నిమిషాల్లో ప్రత్యర్థి ఆట ముగించింది.


Similar News