US Open: సెమీస్‌లో టాప్ సీడ్‌కు షాక్.. అల్కరాజ్ ఔట్

యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్‌కు షాక్.. టైటిల్ దిశగా సాగిన అతని ప్రయాణం సెమీస్‌లో ముగిసింది.

Update: 2023-09-09 16:48 GMT

న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్‌కు షాక్.. టైటిల్ దిశగా సాగిన అతని ప్రయాణం సెమీస్‌లో ముగిసింది. అల్కరాజ్‌ను ఓడిస్తూ మెద్వెదేవ్ ఫైనల్‌‌కు దూసుకెళ్లాడు. మరోవైపు, నోవాక్ జకోవిచ్ 24వ గ్రాండ్ స్లామ్ దక్కించుకునే దిశగా అడుగువేశాడు. సెమీస్‌లో అమెరికా ఆటగాడు బెన్ షెల్టాన్‌పై నెగ్గి 10వ సారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. సోమవారం జకోవిచ్, మెద్వెదేవ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకోవాలనుకున్న అల్కరాజ్ ఆశలపై మెద్వెదేవ్ నీళ్లు చల్లాడు. వింబుల్డన్ నెగ్గిన అల్కరాజ్.. వరుసగా యూఎస్ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేశాడు. అతని పోరాటం కూడా ఆ దిశగానే సాగింది. అయితే, శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో అల్కరాజ్(స్పెయిన్)ను 6-7(3-7), 1-6, 6-3, 3-6 తేడాతో మెద్వెదేవ్(రష్యా) చిత్తు చేశాడు. మూడు గంటల 19 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదేవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. తొలి సెట్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ ఆసక్తికరంగానే మొదలైంది. ఇద్దరు సర్వీస్‌లను కాపాడుకోవడంతో తొలి సెట్ టై బ్రేక్‌కు వెళ్లగా.. అక్కడ మెద్వెదేవ్ పై చేయి సాధించాడు.

అదే జోరులో అతను రెండో సెట్‌ను ఏకపక్షంగా గెలుచుకున్నాడు. ఈ సెట్‌లో అల్కరాజ్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. అయితే, మూడో సెట్‌లో పుంజుకున్న అల్కరాజ్.. 3వ, 4వ, 5వ గేమ్‌లను నెగ్గి 4-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో రెండో సెట్‌ను సాధించి మెద్వెదేవ్‌కు షాకిచ్చాడు. అల్కరాజ్ పుంజుకోవడం, మెద్వెదేవ్ గెలుపుపై కన్నేయడంతో నాలుగో సెట్ రసవత్తరంగా సాగింది.

2-2తో స్కోరు సమమైన సమయంలో మెద్వెదేవ్ వరుసగా 5వ, 6వ, 7వ గేమ్‌లను నెగ్గి మలుపు తిప్పాడు. 6వ గేమ్‌లో సర్వీస్‌ను కోల్పోవడం అల్కరాజ్‌కు నష్టం కలిగించింది. ఈ క్రమంలోనే 9వ గేమ్‌తో మెద్వెదేవ్ విజయం లాంఛనమైంది. దాంతో మెద్వెదేవ్ మూడోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. 2021లో అతను టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

24 టైటిల్ దిశగా జకో..

24వ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన సెర్బియా స్టార్ జకోవిచ్.. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. సెమీస్‌లో జకోవిచ్ 6-3, 6-2, 7-6(7-4) తేడాతో అమెరికా ఆటగాడు షెల్టన్‌పై నెగ్గి ఫైనల్‌కు చేరుకున్నాడు. 2 గంటల 41 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో మూడో సెట్‌లో మినహా జకో ఆధిపత్యమే కొనసాగింది. తొలి రెండు సెట్లను సునాయాసంగా నెగ్గిన జకోకు.. మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది.

ఆఖరి సెట్‌లో జకో 3-1 లీడ్‌తో సెట్‌ను సునాయాసంగా నెగ్గేలా కనిపించాడు. అయితే, పుంజుున్న షెల్టన్ 8వ గేమ్‌లో జకో సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 4-4తో సమం చేశాడు. ఆ తర్వాత నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ టై బ్రేక్‌కు వెళ్లగా..అక్కడ విజయం జకోవిచ్‌నే వరించింది. దాంతో జకోవిచ్ తన కెరీర్‌లో 10వ సారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.


Similar News