Women’s T20 World Cup : బంగ్లాను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్
మహిళల టీ20 వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలుపెట్టిన వెస్టిండీస్ ఆ తర్వాత పుంజుకుంది.
దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలుపెట్టిన వెస్టిండీస్ ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టును నిర్ణీత ఓవర్లలో 103/8 స్కోరుకే కరేబియన్ బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్ నిగర్ సుల్తానా(39) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్లలో కరిష్మా రామ్‌హారక్(4/17) స్పిన్‌తో సత్తాచాటి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించింది. అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని విండీస్ జట్టు రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్(34), స్టాఫానీ టేలర్(27), కాంప్‌బెల్లె(21), డియాండ్రా డాటిన్(19 నాటౌట్) ధాటిగా ఆడటంతో గెలుపు సునాయాసమైంది. 12.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేయడంతో విండీస్ జట్టు భారీగా నెట్‌రన్‌రేట్ సాధించింది. ఈ విజయంతో ఆ జట్టు గ్రూపు-బిలో అగ్రస్థానానికి చేరుకుంది.