భారత పురుషుల టీటీ జట్టుకు కాంస్యం

ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల జట్టు మరోసారి కాంస్య పతకంతోనే సరిపెట్టింది.

Update: 2024-10-10 17:29 GMT

దిశ, స్పోర్ట్స్ : కజకస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల జట్టు మరోసారి కాంస్య పతకంతోనే సరిపెట్టింది. గురువారం జరిగిన సెమీస్‌లో భారత జట్టు 0-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. మరో రెండు గేములు మిగిలి ఉండగానే భారత్ ఓటమి ఖరారైంది. తొలి గేమ్‌లో స్టార్ ప్లేయర్ శరత్ కమల్ 11-7, 12-10, 11-9 తేడాతో లిన్ యున్ జు చేతిలో ఓడగా.. మానవ్ వికాస్ 11-9, 8-11, 11-3, 13-11 తేడాతో కావో చెంగ్ జుయ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఇక, మూడో గేమ్‌ను హర్మీత్ దేశాయ్ 11-6, 11-9, 11-7 తేడాతో హువాంగ్ యాన్ చెంగ్ చేతిలో కోల్పోవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. సెమీస్‌లో ఓడినప్పటికీ పురుషుల జట్టుకు బ్రాంజ్ మెడల్ దక్కింది. 2021, 2023లో కాంస్యమే నెగ్గిన భారత్‌కు వరుసగా ఇది మూడో పతకం. మహిళల జట్టు కూడా బ్రాంజ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ టోర్నీ చరిత్రలో భారత్ 7 పతకాలు సాధించింది. 


Similar News