ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి తిలక్ వర్మ ఎంట్రీ..

విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Update: 2023-08-09 15:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ మంచి ప్రదర్శన కనబర్చాడు. వరుసగా 3 సార్లు 30కిపైగా స్కోర్లు చేశాడు. ఈ ప్రదర్శనలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించి 46వ స్థానంలో నిలిచాడు. స్నిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 36 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతడు 51వ స్థానంలో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌పై భారత్ మూడు వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ సిరీస్‌లో సత్తాచాటిన ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్ గిల్ వన్డే ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో బెస్ట్ రేటింగ్‌ పాయింట్స్‌ను నమోదు చేశారు. శుభ్‌మన్ గిల్ 743 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్ అజామ్ (886) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా ఆటగాడు డసెన్ (777) రెండో స్థానంలో ఉన్నాడు. పాక్‌ ఆటగాళ్లు ఫకార్‌ జమాన్‌ (755), ఇమామ్‌ ఉల్ హక్ (745) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇషాన్‌ కిషన్‌ 9 స్థానాలు మెరుగుపర్చుకుని 36వ స్థానంలో నిలిచాడు.

ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య బ్యాటర్ల విభాగంలో 10 స్థానాలు మెరుగై 71వ స్థానంలో నిలవగా.. ఆల్‌రౌండర్ల కేటగిరీలో ఐదు స్థానాలు ఎగబాకి 11వ స్థానాన్ని దక్కించుకున్నాడు. బౌలర్ల విభాగానికొస్తే.. విండీస్‌పై వన్డే సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన శార్దూల్ ఠాకూర్‌ మూడు స్థానాలు మెరుగై 30వ స్ధానానికి చేరుకున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్ నాలుగు స్థానాలు ఎగబాకి పదో స్థానంలో నిలిచాడు.


Similar News