ఆ పోరులో ఎవరు గెలిస్తే వారిదే ఆసియా కప్: Shane Watson
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఆసియా కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఆసియా కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతి జట్టు కూడా ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనుంది. కాగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాక్‌ల దాయాది పోరు ఆగస్టు 27న జరగనుంది. మైదానంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు అత్యంత ఉత్కంఠగా సాగనుందని సీనియర్ ఆటగాళ్లు జోస్యం చెబుతున్నారు. అదే విధంగా అందరి కళ్లు కూడా ఈ రెండు జట్ల పైనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే పాక్, టీమిండియా మధ్య జరగనున్న మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ వారి ప్రధాన ప్రత్యర్థులపై గట్టి విజయం సాధించిందని, అయినప్పటికీ టీమిండియా ఇప్పుడు గెలవడానికి మెరుగైన అవకాశం ఉందని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. అంతేకాక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుందని, కాబట్టి వారిని అదుపు చేయడం చాలా కష్టమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారే ఆసియా కప్‌ను గెలుస్తారని చెప్పుకొచ్చాడు. భారత్‌ను ఓడించగలమని పాకిస్థాన్‌కు ఇప్పుడు పూర్తి నమ్మకం కూడా ఉందని షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.