ఆటగాళ్ల భద్రత ముఖ్యం..పాక్‌కు వెళ్లొద్దు : టీమిండియాకు పాక్ మాజీ క్రికెటర్ సూచన

వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-31 14:20 GMT

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఆ టోర్నీలో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాక్ వెళ్లడంపై సందిగ్ధం నెలకొంది. భారత ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ జట్టును పంపించడానికి విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా భారత ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాడు. తాజాగా పాక్ మీడియాతో కనేరియా మాట్లాడుతూ.. పాక్‌లో పరిస్థితులు బాగా లేవని, టీమ్ ఇండియా పాక్‌కు రావొద్దని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ కూడా దీనిపై ఆలోచించాలి. ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరిగే అవకాశం ఉంది. దుబాయ్ వేదిక కావొచ్చు.’అని తెలిపాడు.

అలాగే, ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోందని, అయితే, తుది నిర్ణయాన్ని అన్ని దేశాలు అంగీకరిస్తాయని భావిస్తున్నట్టు చెప్పాడు. కాగా, గతేడాది ఆసియా కప్‌ కోసం పాక్‌కు వెళ్లేందుకు టీమిండియా నిరాకరించగా.. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో నిర్వహించారు. ఆసియా కప్ తరహాలో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు, టోర్నీ నిర్వహణకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సిద్ధమవుతున్నది. ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి పంపించింది. భారత అభిమానుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పీసీబీ భారత్ మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 


Similar News