స్వదేశానికి టీమ్ ఇండియా వికెట్ కీపర్ శాంసన్!

టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ శ్రీలంక నుంచి భారత్‌కు తిరిగొచ్చినట్టు తెలుస్తోంది.

Update: 2023-09-09 15:23 GMT

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ శ్రీలంక నుంచి భారత్‌కు తిరిగొచ్చినట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ జట్టుతో కలవడంతో శాంసన్‌ స్వదేశానికి వచ్చినట్టు సమాచారం. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు. అయితే, ఆ సమయంలో రాహుల్ ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బంది పడటంతో శాంసన్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. రాహుల్‌ను ఫిట్‌నెస్ నిరూపించుకోకపోతే శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉండేది. అయితే, ఇటీవల రాహుల్ ఫిట్‌నెస్ టెస్టులు పాసయ్యాడు. శ్రీలంకకు వచ్చిన అతను.. జట్టుతో కలిసి ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు, వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులోనూ శాంసన్‌కు నిరాశే ఎదురైంది.

దాంతో శ్రీలంకలో అతను ఉండటం అవసరం లేదని భావించిన టీమ్ మేనేజ్‌మెంట్.. శాంసన్‌‌ను స్వదేశానికి పంపినట్టు తెలుస్తోంది. ఆసియా కప్, ప్రపంచకప్‌కు శాంసన్‌ను విస్మరించడం పట్ల అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతకాలంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో శాంసన్ విఫలమవుతున్నాడు. దాంతో సెలెక్షన్ కమిటీ నిలకడగా రాణిస్తున్న యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ వైపు మొగ్గుచూపింది.


Similar News