IND vs AUS : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరో తేల్చేసిన గవాస్కర్.. ఆ జట్టే గెలుస్తుందని జోస్యం

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఈ ఏడాది ఆసిస్ గడ్డపై జరగనుంది.

Update: 2024-09-01 12:20 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఈ ఏడాది ఆసిస్ గడ్డపై జరగనుంది. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్లు తొలిసారిగా ఈ సిరీస్‌లో ఐదు టెస్టులు ఆడబోతున్నాయి. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది. తాజాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ సిరీస్‌లో ఎవరు గెలుస్తారో అంచనా వేశాడు. జాతీయ మీడియాతో గవాస్కర్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో టీమిండియానే ఫేవరెట్ అని, 3-1తో సిరీస్‌ను దక్కించుకుంటుందని జోస్యం చెప్పాడు.

‘ఇరు జట్లలో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి, ఈ సిరీస్ కచ్చితంగా ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. అంతేకాకుండా, క్రికెట్‌లో టెస్టు మ్యాచ్ అల్టిమేట్ ఫార్మాట్ అని చూపిస్తుంది. ఈ సిరీస్‌‌ను టీమ్ ఇండియా 3-1తో సొంతం చేసుకుంటుందని నా అంచనా’ అని తెలిపాడు.

అలాగే, ఈ సిరీస్‌కు ముందు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడకపోవడం భారత జట్టుకు చేటు చేసే అవకాశం ఉందని, తొలి టెస్టు కీలకం కానుందని చెప్పాడు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆసిస్ జట్టు ఓపెనింగ్, మిడిలార్డర్ సమస్యలు ఎదుర్కొంటుందని పేర్కొన్నాడు. కాగా, గత నాలుగు సిరీస్‌ల్లో భారత్‌దే ఆధిపత్యం. 2014 తర్వాత ఆసిస్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. గతేడాది భారత గడ్డపై జరిగిన సిరీస్‌ను 2-1తో టీమ్ ఇండియా గెలుచుకుంది.

Tags:    

Similar News