ఆఖరి టీ20లో శ్రీలంకకు అఫ్గాన్ షాక్
టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూసిన ఆతిథ్య శ్రీలంక జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ షాకిచ్చింది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూసిన ఆతిథ్య శ్రీలంక జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ షాకిచ్చింది. దంబుల్లా వేదికగా బుధవారం జరిగిన ఆఖరి టీ20లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 6 వికెట్లను కోల్పోయి 206 పరుగులే చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 209 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్(70) హాఫ్ సెంచరీతో రాణించగా.. హజ్రతుల్లా(45), అజ్మతుల్లా(31) కీలక పరుగులు జోడించారు. లంక బౌలర్లలో పతిరణ, ధనంజయ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక(60), కమిందు మెండిస్(65 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. చివరి ఓవర్‌లో విజయానికి 19 పరుగులు కావాల్సి ఉండగా.. మెండిస్ సిక్స్, రెండు ఫోర్లతో 15 పరుగులే రాబట్టాడు. అఫ్గాన్ బౌలర్లలో నబీ 2 వికెట్లుతో సత్తాచాటాడు. ఆఖరి టీ20లో ఓటమి చెందిన శ్రీలంక 2-1తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.